Telugu Global
Andhra Pradesh

వైఎస్ఆర్ ఇద్దరినీ అలా ఒప్పించారు.. బాలయ్య షోలో సురేశ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. అప్పటికి సురేశ్ రెడ్డికి వైఎస్ఆర్ స్పీకర్‌ను చేస్తానని చెప్పలేదు. అయితే సురేశ్ రెడ్డికి మాత్రం కేసీఆర్ విషయాన్ని చేరవేశారు.

వైఎస్ఆర్ ఇద్దరినీ అలా ఒప్పించారు.. బాలయ్య షోలో సురేశ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి
X

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎవరినైనా పదవులకు ఎంపిక చేయాలంటే ఎంత లోతుగా ఆలోచించేవారో మరోసారి వెల్లడైంది. 2004లో తొలి సారి ముఖ్యమంత్రి అయిన సమయంలో స్పీకర్‌గా సురేశ్ రెడ్డి, చీఫ్ విప్‌గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. వారిద్దరినే ఎంపిక చేయడానికి కారణం ఏంటో సినీ నటుడు బాలకృష్ణ నిర్వహిస్తున్న 'అన్‌స్టాపబుల్' షోలో వివరించారు. వైఎస్ఆర్ అప్పట్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచి.. నిన్ను చీఫ్ విప్‌ను చేయాలంటే సురేశ్ రెడ్డిని స్పీకర్‌గా ఒప్పించు అని చెప్పారు. ఎందుకంటే సురేశ్, కిరణ్ ఇద్దరూ నిజాం కాలేజీలో క్లాస్ మేట్స్ అని తెలుసు. వారిద్దరికీ మంచి సమన్వయం ఉంటుందని వైఎస్ఆర్ అలా ఊహించారు.

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. అప్పటికి సురేశ్ రెడ్డికి వైఎస్ఆర్ స్పీకర్‌ను చేస్తానని చెప్పలేదు. అయితే సురేశ్ రెడ్డికి మాత్రం కేసీఆర్ విషయాన్ని చేరవేశారు. నువ్వు స్పీకర్ కాబోతున్నావు సిద్ధంగా ఉండు అని. ఆ తర్వాత వైఎస్ఆర్ పిలిచి.. నిన్ను స్పీకర్‌ను చేస్తాను. కానీ వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డిని చీఫ్ విప్‌గా ఒప్పించు అని చెప్పారు. అంతే కాకుండా నీ జిల్లాలో ఇంకా ఎవరికీ మంత్రి పదవి ఇవ్వను.. కాబట్టి నీకు ఇబ్బంది కూడా ఉండదని అన్నారు. ఇలా ఇద్దరు స్నేహితులను విడివిడిగా డీల్ చేసి వైఎస్ఆర్ పదవులు కట్టబెట్టారు. సభ సజావుగా సాగాలంటే స్పీకర్, చీఫ్ విప్ మధ్య సమన్వయం ఉండాలనే ఆనాడు వైఎస్ఆర్ అలా చేశారని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అయితే ఈ విషయం కాసేపటి క్రితమే సురేశ్ రెడ్డి నాకు చెప్పారని కిరణ్ అన్నారు.

నేను ఎవరో తెలుసా అని సోనియా అడిగారు..

తనకు ఒక రోజు సోనియా గాంధీ ఫోన్ చేసి మూడు రోజుల్లో సీఎంగా బాధ్యతలు తీసుకోవాలి రెడీగా ఉండు అని కాల్ చేశారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. నేను అంతకు ముందు ఎన్నడూ ఆమెను కలవలేదు, మాట్లాడలేదు. కానీ వాయిస్ గుర్తు పట్టి.. ఓకే మేడమ్ అన్నాను. నా సమాధానంలో ఎలాంటి ఎగ్జయిట్‌మెంట్, సంతోషం లేకపోవడం గమనించి.. నేను ఎవరో తెలుసా అని సోనియా అడిగారు. తెలుసు మేడం.. మీరు మా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అని జవాబిచ్చాను. దాంతో ఆమె ఫోన్ పెట్టేశారు.

ఆ రోజు అలా ఉద్వేగానికి గురి కాకపోవడానికి కారణం ఉంది. గతంలో మా నాన్నకు కూడా అధిష్టానం నుంచి కాల్ వచ్చింది. నువ్వే కాబోయే సీఎం.. కేబినెట్‌ను రెడీ చేసుకో అన్నారు. మా నాన్న (అమర్‌నాథ్ రెడ్డి) సరే అని కేబినెట్ రెడీ చేసుకున్నారు. ఆనాడు ఒక వ్యక్తి నాన్న దగ్గరకు వచ్చి నాకు మంత్రి పదవి ఇవ్వండి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. సరే ఏదయితే అది అని నాన్న అయితే మంత్రి వర్గాన్ని సిద్ధం చేసుకొని ఉన్నారు. కట్ చేస్తే.. చివరకు ఏ వ్యక్తి అయితే నాన్న దగ్గరకు వచ్చి ఏడ్చారో.. ఆయనే సీఎం అయ్యాడు. అందుకే నాకు సోనియా కాల్ చేసినా ఇంట్లో చెప్పలేదు. చివరకు ఏమవుతుందో.. ఇంట్లో వాళ్లను అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకని అనుకున్నానని కిరణ్ అన్నారు.

వైఎస్ఆర్ వెళ్లిన హెలీకాప్టర్‌లో తాను కూడా ఉండాల్సింది. కానీ అసెంబ్లీలో రెండు కమిటీల నియామకం ఉండటంతో ఉండిపోయాను. లేకపోతే నేను కూడా వైఎస్ఆర్‌తో పాటు చనిపోయేవాడిని.. ఆనాడు బతికి ఉన్నా కాబట్టే సీఎం అయ్యాను అని నల్లారి కుమార్ కుమార్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు.

First Published:  27 Nov 2022 7:59 AM IST
Next Story