అందరి ‘స్కిల్’ బయటపడుతోందా?
కుంభకోణంలో తమ పాత్ర లేదని సీమెన్స్ ఇండియా కంపెనీ యాజమాన్యం రాతపూర్వకంగా సీఐడీకి చెప్పింది. ఇదే సమయంలో అధికారులేమో అంతా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే నిధులు విడుదల చేసినట్లు చెప్పారట. మొత్తంగా కుంభకోణంలో ఒక్కొక్కరి సిల్స్ బయటపడుతున్నాయి.
చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినట్లు ఆరోపణలున్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ అధికారులు భాస్కర్‌ను అరెస్టు చేశారు. ఈ భాస్కర్ ఎవరంటే సీమెన్స్ కంపెనీలో పనిచేసిన ఉన్నతోద్యోగి. ఈయన్ను నోయిడాలో అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. చంద్రబాబు హయాంలో యువతలో నైపుణ్యాలు పెంచేందుకని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసమని ప్రత్యేకంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
ఈ సెంటర్‌కు సీఈవో, డిప్యూటీ సీఈవో, ఎండీ, డైరెక్టర్ ఇలా చాలామంది ఉన్నత స్థానాల్లో అపాయింట్ అయ్యారు. వీళ్ళంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులనే చెప్పాలి. ఐదేళ్ళు సెంటర్లో ఏమి జరిగిందో తెలియదు. కానీ ప్రభుత్వం మారగానే రూ. 3300 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు బయటపడ్డాయి. ప్రభుత్వానికి, సీమెన్స్ తో ఒప్పందం ప్రకారం ప్రభుత్వం 10 శాతం+జీఎస్టీ షేర్ రూ. 371 కోట్లు పెడితే, సీమెన్స్ మిగిలిన రూ. 3 వేల కోట్లు వ్యయం చేయాలి. కానీ సీమెన్స్ కంపెనీ రూపాయి విడుదల చేయకుండానే ప్రభుత్వం రూ. 371 కోట్లు విడుదల చేసేసింది.
ఆర్థికశాఖ కార్యదర్శి సునీత వద్దన్నా వినకుండా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే నిధులు విడుదలైపోయాయి. విడుదలైన నిధులు ఏమయ్యాయంటే ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారు. దాంతో విషయాన్ని సీఐడీ, ఈడీ సీరియస్‌గా తీసుకున్నాయి. సీఐడీ ఏమో సూత్రదారులు, పాత్రదారుల గురించి దర్యాప్తు చేస్తుంటే ఈడీ ఏమో హవాలా, షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా వందల కోట్ల రూపాయల తరలింపుపై దర్యాప్తు చేస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, డైరెక్టరుగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ లాంటి కొందరు అరెస్టయ్యారు. మరికొందరు విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పట్లో సీమెన్స్ ఇండియా కంపెనీ ఎండీగా చెప్పుకున్న సుమంత్ బోస్‌తో అసలు తమ కంపెనీకి సంబంధమే లేదని కంపెనీ యాజమాన్యం రాతపూర్వకంగా సీఐడీకి చెప్పింది. కుంభకోణంలో తమ పాత్ర లేదని చెప్పింది. ఇదే సమయంలో అధికారులేమో అంతా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే నిధులు విడుదల చేసినట్లు చెప్పారట. మొత్తంగా కుంభకోణంలో ఒక్కొక్కరి సిల్స్ బయటపడుతున్నాయి.