Telugu Global
Andhra Pradesh

అప్పుడు పోల'వారం'.. ఇప్పుడు హౌసింగ్'వారం'

అప్పటి పోలవారాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కొత్తగా జగన్ హౌసింగ్ వారం అంటూ మొదలు పెట్టారు. ప్రతి శనివారాన్ని హౌసింగ్ డే గా పాటించాలని అధికారులకు సూచించారు.

అప్పుడు పోలవారం.. ఇప్పుడు హౌసింగ్వారం
X

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతి సోమవారం పోలవారం అంటూ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు తన డైరీలో సోమవారాన్ని పోలవారంగా మార్చేసుకుంటున్నానని చెప్పారు. అయితే ఆయన పదవినుంచి దిగిపోయేలోగా పోలవరం పూర్తి కాలేదు, ఇప్పటికీ అదింకా పూర్తి కాలేదు, వైసీపీకి మిగిలిన ఏడాదిన్నరలో పూర్తవుతుందని కూడా చెప్పలేం. అప్పటి పోలవారాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కొత్తగా జగన్ హౌసింగ్ వారం అంటూ మొదలు పెట్టారు. ప్రతి శనివారాన్ని హౌసింగ్ డే గా పాటించాలని అధికారులకు సూచించారు.

గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు.. ఇలా ఏపీలో అటు అపార్ట్ మెంట్లు, ఇటు ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి లేదు. టీడీపీ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్లకంటే ముందు జగనన్న ఇళ్లను పంపిణీ చేయాలనే పట్టుదలతో ఉంది వైసీపీ ప్రభుత్వం. నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో కాంట్రాక్టర్లు పనులకు వెనకాడుతున్నారు. దీంతో అధికారులు టార్గెట్లు పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇకపై ఆలస్యం కుదరదని, ఎన్నికలనాటికి జగనన్న ఇళ్లలో జనం నివాసం ఉండేలా చూడాలని ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి. జగనన్న ఇళ్ల పురోగతిపై జరిగిన సమీక్షలో ఆయన హౌసింగ్ డే ని ప్రకటించారు. ఇకపై ప్రతి శనివారం అధికారులు హౌసింగ్ డే గా పాటించాలని, ఆ రోజు తప్పనిసరిగా లే అవుట్లను సందర్శించాలని ఆదేశించారు. ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు సీఎం జగన్.

ప్రయోజనం ఏంటి..

గతంలో చంద్రబాబు పోలవారం అంటూ హడావిడి చేసినా పెద్దగా ఫలితం లేదు. ఇప్పుడు జగన్ హౌసింగ్ వారం అంటూ చేస్తున్న పనికి కూడా ఫలితం కనపడేలా లేదు. నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో కాంట్రాక్టర్లు పనుల్ని ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు వస్తున్న సాయం కూడా ఆలస్యం అవుతోంది. దీంతో జగనన్న కాలనీల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇచ్చిన స్థలాల్లోకి జనం వెళ్లడానికి, ఇళ్లు నిర్మించుకోడానికి జంకుతున్నారు. కానీ ఎన్నికలనాటికి ఈ జగనన్న కాలనీలు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారే అవకాశముంది. ఆలోగా వీలైనన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలనుకుంటున్నారు. అందుకే జగన్, హౌసింగ్ డే అంటూ శనివారం పేరు మార్చేశారు.

First Published:  24 Nov 2022 5:19 PM IST
Next Story