Telugu Global
Andhra Pradesh

ఇద్దరు ఎంపీలకు ఎంత తేడా?

పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఒకే పరిస్థితిలో ఉన్నా, ఒకే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఒక ఎంపీ విషయంలో పార్టీ, ప్రభుత్వ స్పందన చాలా తీవ్రంగా ఉంటే మరో ఎంపీకి సంబంధించి అంటీముట్టనట్లున్నారు. ఈ విషయమే చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇద్దరు ఎంపీలకు ఎంత తేడా?
X

అధికార పార్టీ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఒకే పరిస్థితిలో ఉన్నా, ఒకే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఒక ఎంపీ విషయంలో పార్టీ, ప్రభుత్వ స్పందన చాలా తీవ్రంగా ఉంటే మరో ఎంపీకి సంబంధించి అంటీముట్టనట్లున్నారు. ఈ విషయమే చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విషయం ఏమిటంటే వైసీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఇద్దరూ కూడా దర్యాప్తు సంస్థ‌ల విచారణను ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పాత్రధారుడిగా ఒంగోలు ఎంపీ మాగుంటను ఢిల్లీలో ఈడీ విచారిస్తోంది. ఇప్పటికి రెండు సార్లు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన ప్రతిసారి అరెస్టు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇదే కేసులో ఆయన కొడుకు మాగంట రాఘవరెడ్డి అరెస్టయ్యారు కాబట్టి. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధంలేదని ఎంపీ మొత్తుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి కానీ పార్టీ తరఫున‌ కానీ ఎంపీకి నైతికంగా పెద్దగా మద్దతు దొరుకుతున్నట్లు అనిపించటంలేదు.

ఇదే సమయంలో వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డే కీలక పాత్రధారులని సీబీఐ బలంగా వాదిస్తోంది. హత్యతో తమకు ఎలాంటి సంబంధంలేదని తండ్రీకొడుకులు మొత్తుకుంటున్నారు. రెండుసార్లు విచారించిన తర్వాత సీబీఐ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఈరోజో రేపో ఎంపీని కూడా అరెస్టు చేయవ‌చ్చు అనే ప్రచారం తెలిసిందే. ఇక్కడే ఇద్దరు ఎంపీల మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది. భాస్కర్, అవినాష్ విచారణ అనగానే పార్టీ నేతలంతా గోల చేస్తున్నారు.

భాస్కర్ అరెస్టు నేపథ్యంలో జగన్ అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. అవినాష్ అరెస్టు అయ్యే అవకాశాలపై పార్టీ ముఖ్యులతో చర్చించారు. ఒకటిరెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్ళచ్చనే ప్రచారం మొదలైంది. మాగుంట, అవినాష్ ఇద్దరూ ఎంపీలే. కాకపోతే అవినాష్ సీఎంకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు. మాగుంటేమో పార్టీలు మారి అవసరార్థం వైసీపీలో ఉన్నారు. తేడా వస్తే మళ్ళీ టీడీపీలోకి వెళ్ల‌డానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకేనేమో ఇద్దరి విషయంలో పార్టీ, ప్రభుత్వంలో ఇంత తేడా కనబడుతోంది.

First Published:  18 April 2023 7:47 AM GMT
Next Story