Telugu Global
Andhra Pradesh

రెంటికి చెడ్డ రేవడి షర్మిల.. సీనియర్ల అనాసక్తి

ఆంధ్రప్రదేశ్‌ పిసిసి అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత షర్మిల సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులను కలిసి, వారిని పార్టీలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు.

రెంటికి చెడ్డ రేవడి షర్మిల.. సీనియర్ల అనాసక్తి
X

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించి షర్మిల పెద్ద పొరపాటు చేశారనే అనిపిస్తోంది. తెలంగాణలో రాజకీయాలను ప్రారంభించి ఆంధ్ర రాజకీయాల్లోకి ఆమె ప్రవేశించారు. దీంతో ఉన్నది పోవడమే కాకుండా ఉంచుకున్నది పోతుందనే సామెత షర్మిల రాజకీయాల విషయంలో వాస్తవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కాంగ్రెస్‌కు పెద్దగా ఊపు వచ్చిన సూచనలేవీ కనిపించడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ పిసిసి అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత షర్మిల సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులను కలిసి, వారిని పార్టీలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు. గతంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డితో కలిసి నడిచిన పెద్దలను ఆమె కలుస్తున్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌తో ఆమె సమావేశమయ్యారు. అయితే, ఆయన కాంగ్రెస్‌లోకి రావడం అటుంచి, క్రియాశీలక రాజకీయాలపైనే ఆసక్తి ప్రదర్శించలేదు.

అలాగే, రాజశేఖర రెడ్డి మిత్రులు దుట్టా రామచందర్‌ రావుతో ఆమె భేటీ అయ్యారు. దుట్టా త్వరలోనే కాంగ్రెస్‌లోకి వస్తారని షర్మిల చెప్పారు. అయితే, ఆయన అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించలేదు. తాను 40 ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడిచానని చెబుతూనే రాజకీయాల పట్ల ఆయన అనాసక్తి ప్రదర్శించారు. ఇక ముందు తాను డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసుకుంటానని చెప్పారు.

ఆ తర్వాత మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డిని కలిశారు. ఆయన కూడా కాంగ్రెస్‌లోకి రావడానికి అంత ఆసక్తి కనబరిచినట్లు లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, డీఎల్‌ రవీంద్రారెడ్డి వంటి సీనియర్‌ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అటువంటి నేతలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకోవడానికి ఏ విధమైన ఆధారమూ లేదు. రాష్ట్రంలో పూర్తిగా చచ్చిపోయిన కాంగ్రెస్‌ తిరిగి ప్రాణం పోసుకుంటుందనే నమ్మకం ఎవరికీ లేదు. ఇటువంటి స్థితిలో షర్మిల ప్రయత్నాలు నామమాత్రంగా కూడా ఫలించే సూచనలు కనిపించడం లేదు.

షర్మిలతో పాటు ప్రస్తుతం నడుస్తున్నది కేవీపీ రామచందర్‌ రావు, తులసిరెడ్డి, రఘువీరా రెడ్డి వంటి కొద్ది మంది మాత్రమే. ప్రత్యక్ష రాజకీయాలను కేవీపీ రామచందర్‌ రావు ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది అనుమానమే. తులసిరెడ్డి, రఘువీరారెడ్డి వంటివాళ్ల వల్ల ఒరిగేదేమీ లేదు. కొత్త రక్తం పార్టీలోకి వచ్చే సూచనలు లేవు. యువతరానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తమ ప్రతినిధిగా కనిపిస్తున్నారు. పాత కాలం రాజకీయాలకు అవకాశం లేదు. యువ ప్రతినిధి జగన్‌ను ఎదుర్కోవడానికి టిడిపి అధినేత చంద్రబాబే అపసోపాలు పడుతున్నారు. ఇటువంటి స్థితిలో షర్మిలకు మద్దతు లభిస్తుందనేది వొట్టి మాట.

First Published:  2 Feb 2024 5:50 PM IST
Next Story