Telugu Global
Andhra Pradesh

ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల డెడ్ లైన్..

ఆమధ్య విజయవాడ కేంద్రంగా జరిగిన సీపీఎస్ రద్దు నిరసన ప్రదర్శనకు ఉపాధ్యాయులు నేతృత్వం వహించారు. తాజాగా రెవెన్యూ ఉద్యోగులు ఫిబ్రవరి-5 సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు.

ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల డెడ్ లైన్..
X

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ వర్గాలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. పీఆర్సీ విషయంలోనే వారికి తొలి దెబ్బ పడింది, ఆ తర్వాత పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ విషయంలో ప్రభత్వం జాగు చేయడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఏనెలకానెల జీతాలు ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణ ఉండనే ఉంది. డీఎస్సీ వేయలేదు, కొత్త రిక్రూట్ మెంట్లు బాగా తగ్గిపోయాయి. అదేమని అడిగితే సచివాలయాల స్టాఫ్ ని తీసుకున్నాం కదా సరిపెట్టుకోండి అంటున్నారు. ఆ సచివాలయాల ఉద్యోగులు కూడా ఏడాది తర్వాత రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తే కాని వారికి పరీక్షలు పెట్టి పర్మినెంట్ చేయలేదు. మధ్యలో వాలంటీర్ల గోల కూడా ఉంది. వారికి అవార్డులిచ్చి సరిపెట్టారనుకోండి. దాదాపుగా ఏ విభాగం ఉద్యోగులూ పూర్తి స్థాయి సంతృప్తిగా లేరు. ఇటీవల ముఖ ఆధారిత హాజరు అంటూ కొత్త విధానం తీసుకు రావడంపై కూడా ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. లోపల కారణాలు ఇవన్నీ, పైకి మాత్రం బకాయిల సమస్యతో ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు.

ఉద్యోగ సంఘాల విషయంలో రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సచివాలయాల రాకతో రెవెన్యూ వ్యవస్థపై పనిభారం తగ్గుతుందని అనుకున్నా అది కుదర్లేదు. అదే సమయంలో వారి అధికారాలకు కత్తెరలు పడ్డాయి. గడప గడపకు వస్తున్న ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించాలంటూ ప్రభుత్వ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఉదారంగా లేదు, కాస్త కఠినంగానే ఉంది అనే విషయం రుజువైంది. దీంతో వారంతా ఉమ్మడి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

ఆమధ్య విజయవాడ కేంద్రంగా జరిగిన సీపీఎస్ రద్దు నిరసన ప్రదర్శనకు ఉపాధ్యాయులు నేతృత్వం వహించారు. తాజాగా రెవెన్యూ ఉద్యోగులు ఫిబ్రవరి-5 సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. ఆలోగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని అల్టిమేట్టం ఇచ్చారు ఏపీ జేఏసీ అమరావతి నేతలు. ఆ తర్వాత ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఇటీవల ఉద్యోగ సంఘాల్లో ఓ వర్గం ఏపీ గవర్నర్ ని కలసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే, ఆ తర్వాత మరో సంఘం తెరపైకి వచ్చి జగన్ సర్కారుకి వత్తాసుగా మాట్లాడింది. ఇలాంటివన్నీ ఉద్యోగ సంఘాల్లో సహజమేనని అంటున్న ఏపీ జేఏసీ అమరావతి వర్గం.. అందర్నీ కలుపుకొని ఉద్యమంలోకి వెళ్తున్నామని చెప్పారు.

ఆర్థిక కార్యదర్శి కూడా ఇలా చేస్తే ఎలా..?

ఉద్యోగులు గవర్నర్ ని కలవడం, ఆ తర్వాత పత్రికల్లో వచ్చిన కథనాలపై ఏపీ ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఓ బహిరంగ ప్రకటన ఇచ్చారు. అయితే ఆ ప్రకటనలో పాత జీవోలనే కొత్తగా చూపించారనేది ఏపీ జేఏసీ అమరావతి వాదన. పాత విషయాలనే కొత్తగా చెప్పి కవర్ చేసుకోవాలని చూశారని, గత ప్రభుత్వంలో కూడా ఇలాగే జరిగింది కదా అంటున్నారని ఆక్షేపించారు. మొత్తమ్మీద ఉద్యోగులు మాత్రం ఈసారి ఊరుకునేలా లేరు. గతంలో చర్చల సందర్భంగా సీఎం జగన్ చాలాసార్లు డెడ్ లైన్లు పెట్టారని, కానీ వాటిని పాటించలేకపోయారని, ఈసారి ప్రభుత్వానికి తాము విధిస్తున్న డెడ్ లైన్ మాత్రం కచ్చితంగా పాటిస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి-5 తర్వాత ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న సమయంలో ఇంకా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం లైట్ తీసుకుంటుందా, చర్చలతో కాలయాపన చేస్తుందా అనేది వేచి చూడాలి.

First Published:  23 Jan 2023 7:37 AM IST
Next Story