ఏపీలో సీపీఎస్ రగడ.. మంత్రులతో చర్చకు ఉద్యోగ సంఘాలు డుమ్మా
ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున 7 ఉద్యోగ సంఘాల నేతలు చర్చలను బహిష్కరించారు. పాత పెన్షన్ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని నేతలు విమర్శించారు.
ఎన్నికల ముందు ఘనంగా హామీ ఇచ్చారు కదా, ఆ ఒక్క హామీ నెరవేర్చండి అని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఆ ఒక్కటి తప్ప ఇంకేమైనా అడగండి అని ప్రభుత్వం సర్ది చెబుతోంది. ఇద్దరూ పట్టు వీడటం లేదు, మెట్టు దిగడంలేదు, తెగేదాకా లాగేందుకే సిద్ధమయ్యారు. ఈ దశలో తాజాగా మంత్రులతో జరిగిన చర్చలను ఏడు సంఘాలు బహిష్కరించాయి. సీపీఎస్ రద్దు మినహా తమకింకేమీ వద్దని చెబుతున్నారు ఉద్యోగులు. ఏడు సంఘాలు హాజరు కాకపోవడంతో మిగతా ఆరు సంఘాల నేతలతో సమావేశమయ్యారు మంత్రులు.
ప్రభుత్వం తరపున మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ భేటీకి హాజరు కాగా, ఉద్యోగ సంఘాల తరపున బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, సూర్య నారాయణ, వెంకట్రామి రెడ్డి ఇతర నేతలు చర్చల్లో పాల్గొన్నారు. ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున 7 ఉద్యోగ సంఘాల నేతలు ఈ చర్చలను బహిష్కరించారు. పాత పెన్షన్ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని నేతలు విమర్శించారు.జీపీఎస్ పేరుతో కొన్ని నెలలుగా రాష్ట్రప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగానే సాగదీస్తోందన్నారు. సీపీఎస్ రద్దు అనే అజెండా ఉంటేనే చర్చిస్తామని తాము గతంలోనే తేల్చి చెప్పామని, రాతపూర్వకంగా తెలియజేశామని, కానీ పదే పదే జీపీఎస్ అంటూ సమావేశం పెట్టడం సమంజసం కాదన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ మిలియన్ మార్చ్ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులపై పెట్టిన క్రిమినల్ కేసులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాల నేతలు.
తెగేదాకా..
ప్రభుత్వం ఆమధ్య సీపీఎస్ రద్దుకి ఉత్సాహంగానే ఉన్నట్టు కనిపించినా, సడన్ గా ప్లేటు ఫిరాయించింది. ఎన్నికలనాటికి సీపీఎస్ రద్దు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే సడన్ గా ఇప్పుడు మళ్లీ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు భేటీ కావడం విశేషం. ఏడు సంఘాలు కాస్త గట్టిగానే ఉన్నా, మిగతా సంఘాలు మాత్రం చర్చలకు ఉత్సాహంగా వెళ్లాయి. 12వ పీఆర్సీ కమిటీపై కూడా త్వరలో ప్రకటన చేయాలంటున్నారు నేతలు. పెండింగ్ అంశాలపై చర్చిస్తామంటూ జీఏడీ కార్యదర్శినుంచి మెసేజ్ వచ్చిందని, అందుకే చర్చలకు వెళ్లామని ప్రకటించారు. సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగ సంఘాల్లో చీలికలు లేవని స్పష్టం చేశారు.