ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.. - టీడీపీ, జనసేన తీరుపై బండి శ్రీనివాసరావు లేఖ
అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి ఉద్యోగులపై పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలను తన లేఖలో ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని తన లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, వారికి అండగా ఉండి మానసిక స్థైర్యం కల్పించాలని కోరారు. ఉద్యోగులకు వ్యక్తిగత అజెండాలు ఉండవని, రాష్ట్ర అభివృద్ధిలో వారిదే కీలక పాత్ర అని చెప్పారు.
రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ విధులు నిర్వర్తించడమే ఉద్యోగుల కర్తవ్యమని. రాజకీయ పార్టీలతో ఉద్యోగులకు సంబంధం లేదని బండి తన లేఖలో పేర్కొన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే విధులు నిర్వహిస్తారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఉద్యోగులను దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. నర్సీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై మున్సిపల్ అధికారులను బూతులు తిట్టి దౌర్జన్యపూరితంగా మాట్లాడారని, ఇది ఉద్యోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేసే విధంగా ఉందని బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి ఉద్యోగులపై పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలను తన లేఖలో ఆయన ప్రస్తావించారు. రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్‌లను నా కొడకల్లారా.. నరుకుతా.. అంటూ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడటం, వారిని దూషించడాన్ని ఖండిస్తున్నామని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉద్యోగులను బెదిరించడం ఆ ఉద్యోగుల కుటుంబసభ్యులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని తెలిపారు.
మరోపక్క కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఎలక్ట్రికల్ డీఈ మన్నెం విజయ భాస్కరరావు ఇంటిలోకి వెళ్లి జనసేన కార్యకర్తలు బలవంతంగా క్షమాపణలు చెప్పించారని, విధి నిర్వహణలో తప్పుచేసి ఉంటే ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం దారుణమని పేర్కొన్నారు. ఉద్యోగులతో సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, బెదిరింపులకు, దాడులకు దిగడం, విధులకు ఆటంకం కలిగించడం వంటివి విడనాడాలని విజ్ఞప్తి చేస్తున్నామని బండి శ్రీనివాసరావు తన లేఖలో కోరారు.