చిరంజీవి ఇంటికి పవన్.. భావోద్వేగానికి గురైన మెగా బ్రదర్స్
ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారి చిరంజీవి ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చిరంజీవి నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ఏపీలో జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో గెలవడంతో పాటు తాను కూడా పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచిన అనంతరం తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇవాళ చిరంజీవి ఇంటికి వచ్చారు. పవన్ రాకతో చిరంజీవి ఇంట సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ ను కుటుంబ సభ్యులందరూ హత్తుకొని అభినందించారు. పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవి, అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలకు ప్రణమిల్లి పాదాభివందనం చేశారు.
చిరంజీవి పెద్ద పూలమాలతో తమ్ముడిని సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న నాగబాబు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద కేక్ తెప్పించిన చిరంజీవి పవన్ కళ్యాణ్ తో కట్ చేయించారు. ముందుగా చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారి చిరంజీవి ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చిరంజీవి నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. పవన్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలకు గురయ్యారు.
పార్ట్ టైం పొలిటీషియన్ అని, ప్యాకేజీ స్టార్ అన్న విమర్శలు వైసీపీ నుంచి వచ్చాయి. తనపై వచ్చిన విమర్శలను ఎదుర్కొని పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రెండు ఎంపీ స్థానాల్లో కూడా గెలవడంతో ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే తన సినీ, రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన తన అన్నయ్య చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పేందుకు పవన్ ఆయన నివాసానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో మెగా కుటుంబ సభ్యులందరూ కనిపించినప్పటికీ అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా కనిపించకపోవడం గమనార్హం.