ఒక వ్యక్తికి ఒకచోటే ఓటుండాలి.. – వైసీపీ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు
ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలని, కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
వేరే రాష్ట్రాల్లో ఓటు ఉన్న వారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గంలో, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలని, ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓట్లపై ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. పక్క రాష్ట్రాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నవారికి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటు హక్కు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం అందజేశారు.
ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలని, కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. వేరే ఎక్కడా ఓటు లేదని వారు డిక్లరేషన్ ఇవ్వాలని తెలిపింది. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించింది. తప్పుడు డిక్లరేషన్‌తో ఓటు నమోదు కోసం దరఖాస్తు చేస్తే జైలు శిక్ష. 20 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్క్ ఇవ్వాలని తెలిపింది. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు ఉండాలని, ఇళ్లు మారే వాళ్లు ఓటుకి ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలని పేర్కొంది. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే కేసు నమోదు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.