Telugu Global
Andhra Pradesh

పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు వద్దు..

సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పరిగణలోకి తీసుకున్న ఈసీ తాజా ఆదేశాలిచ్చింది.

పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు వద్దు..
X

ఒకటో తేదీ వస్తోంది. ఎన్నికల సీజన్లో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తారా లేక సచివాలయ సిబ్బంది ఆ బాధ్యత తీసుకుంటారా అనే కన్ఫ్యూజన్ ఉంది. ఇటీవల సెర్ప్ ఆదేశాల మేరకు వాలంటీర్లే పెన్షన్లు పంపిణీ చేస్తారని అనుకున్నారంతా. కానీ తాజాగా ఈసీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశాలిచ్చింది. వారితో నగదు పంపిణీ చేపట్ట వద్దని చెప్పింది.

ఎందుకీ నిర్ణయం..?

వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలేదు. వారికి ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తున్నా.. వైసీపీ కార్యకర్తల్లాగే వారిని ట్రీట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఎన్నికల సీజన్లో ఈ గొడవ మరింత పెరిగింది. వాలంటీర్లు పెన్షన్లు ఇస్తూ వైసీపీకి ప్రచారం చేస్తారంటూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో లబ్ధిదారుల సమాచారం మొత్తం ఉంటుందని, ఆ సమాచారాన్ని వారు అధికార పార్టీ నేతలతో పంచుకుంటారని, తద్వారా ఓటర్లను ప్రలోభ పెడతారనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ఈసీ.. ఇటీవల వాలంటీర్ల నుంచి మొబైల్ డివైజ్ లు వెనక్కు తీసుకోవాలని సూచించింది. ఈలోగా ఒకటో తేదీ రావడంతో వాలంటీర్లతోనే పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధపడింది. దీంతో సిటిజన్ ఫర్ డెమొక్రసీ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పరిగణలోకి తీసుకున్న ఈసీ తాజా ఆదేశాలిచ్చింది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా పెట్టాలని సూచించింది.

గందరగోళం..

అభ్యర్థులతోపాటు వాలంటీర్లు కూడా ఇటీవల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ కొంతమందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మరికొందరు వాలంటీర్లు ఈ గొడవంతా ఎందుకని స్వచ్ఛందంగా రాజీనామా చేసి, రాజకీయ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది వాలంటీర్లుగా ఉన్నారు, ఎంతమంది రాజీనామా చేశారనే లెక్కలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. తాజాగా పెన్షన్లకు కూడా వాలంటీర్లను దూరం పెట్టడంతో.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వారికి పని ఉంటుందా, లేదా అనేది అనుమానంగా మారింది.

First Published:  30 March 2024 9:00 PM IST
Next Story