పథకాలకు ఈసీ బ్రేక్.. జగన్ కీలక వ్యాఖ్యలు
వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన నిధులతో పాటు రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ నిధుల విడుదల కూడా ఆగిపోతుంది. 2019లో పథకాల అమలుకు అనుమతి ఇచ్చిన ఈసీ.. ఇప్పుడు ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలకు బ్రేక్ వేయడం ఏమిటని వైసీపీ ప్రశ్నిస్తోంది.
ఏపీలో పథకాల అమలుకు ఈసీ బ్రేక్ వేసింది. 2019కు భిన్నంగా ఈసీ వైఖరి ఉండడాన్ని వైసీపీ ప్రశ్నిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు పసుపు- కుంకుమ పథకం తెచ్చారు. ఆ పథకం కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే అన్నది జగమెరిగిన సత్యం. అప్పట్లో ఆ పథకంపై అభ్యంతరాలు వచ్చినా ఈసీ నిధుల విడుదలకు ఓకే చేసింది. దాంతో తీరా ఎన్నికల సమయంలో చంద్రబాబు మహిళల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. అయినా ఫలితం మాత్రం బెడిసికొట్టింది.
ఇప్పుడు మాత్రం పథకాలకు నిధులు విడుదలకు ఈసీ నో చెప్పింది. కోడ్ రావడానికి ముందే వైఎస్ఆర్ ఆసరా, విద్యాదీవెన పథకాలకు జగన్ బటన్ నొక్కారు. 70 శాతం మంది ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి. మిగిలిన వారి ఖాతాల్లోకి జమ అవుతున్న సమయంలోనే కోడ్ రావడంతో నిధుల విడుదలకు బ్రేక్ పడింది. టీడీపీ ఫిర్యాదుల కారణంగా ప్రభుత్వం లేఖలు రాసిన ఈసీ స్పందించలేదు. తాజాగా నిధుల విడుదలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపాలని ఆదేశించింది.
దీంతో వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన నిధులతో పాటు రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ నిధుల విడుదల కూడా ఆగిపోతుంది. 2019లో పథకాల అమలుకు అనుమతి ఇచ్చిన ఈసీ.. ఇప్పుడు ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలకు బ్రేక్ వేయడం ఏమిటని వైసీపీ ప్రశ్నిస్తోంది.
ఈ పరిణామంపై మచిలీపట్నంలో ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. పరిస్థితులు చూస్తుంటే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆన్ గోయింగ్ పథకాలకూ నిధులు విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని, ఇష్టానుసారం అధికారులను బదిలీ చేస్తున్నారని ఇవన్నీ కుట్రపూరితంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.