అక్కడ వాలంటీర్ రేప్.. ఇక్కడ జనసేన కార్యకర్త లైంగిక దాడి
నిందితుడు ఏ వర్గం వాడయినా, ఎవరి అనుచరుడైనా, అతడు చేసే పని ఏదయినా.. తప్పు తప్పే. కానీ నిందితుడిలోని మరో కోణమే మీడియాలో హైలైట్ కావడం ఇక్కడ విశేషం.
ఆమధ్య పవన్ కల్యాణ్, వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఎల్లో మీడియా అవే వార్తల్ని హైలైట్ చేసేది. వాలంటీర్లు - పోలీస్ కేసులు, వాలంటీర్లు - వేధింపులు అంటూ ఓ సిరీస్ నడిపారు. మళ్లీ ఇప్పుడు వాలంటీర్ రేప్ కేసు అంటూ ఓ కథనం ఈనాడులో వచ్చింది. సరిగ్గా పవన్ కల్యాణ్ చెప్పినట్టే.. ఇంట్లో పెద్దవాళ్లెవరూ లేని సమయంలో ఆధార్ కార్డ్ కోసం వెళ్లి పదో తరగతి బాలికపై అత్యాచారం చేశాడు నీలాపు శివకుమార్ అనే గ్రామ వాలంటీర్. ఆ తర్వాత పలుమార్లు ఆమెను బెదిరించి అదేపని చేశాడు. ఆ బాలిక గర్భవతి కావడంతో వ్యవహారం బయటపడింది. తప్పించుకోవాలని చూసినా ఊరి పెద్దల పంచాయితీతో చివరకు పెళ్లికి ఒప్పుకున్నాడు. తీరా పెళ్లి ముందు రోజు పరారయ్యాడు. ఇదీ ఈనాడు కథనం. ఈ ఘటన ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిందని, పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని చెబుతున్నారు. వాలంటీర్ కు వైసీపీ నేతల అందడందలున్నాయని అంటున్నారు.
సాక్షిలో కౌంటర్ కథనం..
సహజంగా వాలంటీర్ కేసులు సాక్షిలో కనపడవు కాబట్టి.. అక్కడ జనసేన కార్యకర్త లైంగిక దాడి అనే విషయం హైలైట్ గా మారింది. పశ్చిమగోదావరి జిల్లా పంజావేమవరానికి చెందిన జనసేన కార్యకర్త పంజా నాగేంద్ర అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడనేది సాక్షి కథనం. మైనర్ బాలికను కాళ్లు, చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్ సమీపంలోకి తీసుకువెళ్లి అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడట నాగేంద్ర. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేరాలు, ఘోరాల గురించి మీడియాలో కథనాలు సహజమే అయినా.. ఇప్పుడు ఆ నిందితుడి బ్యాక్ గ్రౌండ్ మాత్రం వారి వారి వ్యతిరేక మీడియాల్లో బాగా హైలైట్ అవుతోంది. రేపిస్ట్ వాలంటీర్ అంటూ ఈనాడులో వార్త వస్తే.. జనసేన కార్యకర్త దుర్మార్గం అంటూ సాక్షి కథనాన్ని ఇస్తోంది. నిందితుడు ఏ వర్గం వాడయినా, ఎవరి అనుచరుడైనా, అతడు చేసే పని ఏదయినా.. తప్పు తప్పే. కానీ నిందితుడిలోని మరో కోణమే మీడియాలో హైలైట్ కావడం ఇక్కడ విశేషం.