Telugu Global
Andhra Pradesh

జగన్ చార్టర్డ్ ఫ్లైట్.. ఏపీలో పొలిటికల్ హీట్

ప్రభుత్వ పథకాల సంగతి సరే, వ్యక్తిగత విషయాలు కూడా చిలువలు పలువలుగా వార్తల రూపంలో రావడం విశేషం. తాజాగా పొలిటికల్ సెటైర్.. సీఎం జగన్ లండన్ కు వెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్ పైకి మళ్లింది.

జగన్ చార్టర్డ్ ఫ్లైట్.. ఏపీలో పొలిటికల్ హీట్
X

ఏపీలో మీడియా వర్సెస్ మీడియా అన్నట్టుగా పొలిటికల్ సీన్ మారిపోయింది. మార్గదర్శి వ్యవహారంలో ప్రభుత్వం స్క్రూ బిగించడంతో ఈనాడుకి ఉక్కపోత మొదలైంది. అందుకే జగన్ పై ఎదురుదాడి ఉధృతం చేసింది. సీఎం జగన్ కి సంబంధించి ప్రతి రోజూ ఈనాడులో వ్యతిరేక వార్తలు బ్యానర్లో కనపడుతున్నాయి. ప్రభుత్వ పథకాల సంగతి సరే, వ్యక్తిగత విషయాలు కూడా చిలువలు పలువలుగా వార్తల రూపంలో రావడం విశేషం. తాజాగా పొలిటికల్ సెటైర్.. సీఎం జగన్ లండన్ కు వెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్ పైకి మళ్లింది.

ఏమా కథ..?

ఇటీవల సీఎం జగన్ లండన్ వ్యక్తిగత పర్యటనకు కుటుంబంతో సహా వెళ్లారు. అయితే ఆయన వెళ్లిన ఫ్లైట్ ఇప్పుడు వార్తల్లోకెక్కింది.

ఆ విమానం పేరు - ఎంబ్రాయెర్‌ లినేజ్‌ 1000

గరిష్టంగా అందులో 19మంది ప్రయాణించే అవకాశముంది.

ఆ విమానం ఖరీదు సుమారు రూ.435.75 కోట్లు

గంటకు అద్దె సుమారు 14,850 డాలర్లు

ఇలా ఆ విమానం గురించి రాసుకొచ్చింది ఈనాడు పేపర్. అంతే కాదు, జగన్ ఆ విమానంలో, అంత ఖర్చుతో ఎందుకు టూర్ వెళ్లాల్సి వచ్చిందంటూ నిలదీసింది.

క్లాస్ వార్..

ఆమధ్య ఏపీ రాజకీయాల్లో క్లాస్ వార్ అనేది ప్రముఖంగా వినిపించింది. పేదల పక్షపాతికి, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అంటూ సీఎం జగన్ పలుమార్లు సభల్లో ప్రతిపక్షాలను విమర్శించారు. తాను పేదల పక్షపాతిని అని చెప్పుకున్నారు. అయితే ఆయన ఎక్కడా తాను పేదవాడిని అని చెప్పుకోలేదు. కానీ ఈనాడు అనుకూల మీడియా క్లాస్ వార్ ని హైలెట్ చేస్తూ సీఎం జగన్ ని పేదవాడు అంటున్నారని, ఆయన ఆస్తుల విలువ ఇదీ అంటూ కథనాలిచ్చింది. ఆయన ప్యాలెస్ లలో ఉంటారని కూడా విమర్శలు గుప్పించింది. ఇటీవల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా కుప్పం ఇంటి విషయంలో 'మాది ప్యాలెస్ కాదు' అంటూ సెటైర్లు పేల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జగన్ వెళ్లిన విమానాన్ని వార్తల్లోకెక్కించారు, కాదు కాదు ఎక్కేలా చేశారు.

చంద్రబాబు ప్రయాణాల లెక్కలు తీస్తే పరిస్థితి ఏంటి..?

ఈనాడు కథనం చూస్తే రామోజీరావు ఫ్రస్టేషన్ ఏ స్థాయిలో ఉందో ఈజీగా అర్థమవుతుంది. అదే సమయంలో వైరి వర్గం, చంద్రబాబు ప్రయాణాల లెక్కలు తీస్తే ఏమవుతుందనే ఆలోచన మాత్రం ఇక్కడ మిస్సయింది. అధికారంలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా చంద్రబాబు ఎక్కడా తగ్గేది లేదంటారు. అధికారిక, అనధికారిక కార్యక్రమాలకు కూడా చార్టర్డ్ ఫ్లైట్ లు వాడిన సందర్భాలున్నాయి. మరి ఆయన్ను ఎలాంటి పేదల లిస్ట్ లో చేర్చాలి. తొమ్మిదేళ్లుగా ఏపీ, తెలంగాణ మధ్య షటిల్ సర్వీసు చేస్తున్న బాబు ప్రయాణ ఖర్చులు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే. ఆ లెక్కలన్నీ సాక్షి మీడియా బయటకు తీస్తే ఎవరి పరువు పోతుంది..? క్లాస్ వార్ లో ఎవరు గెలిచినట్టవుతుంది..?

ఆ మాటకొస్తే చంద్రబాబు అధికారం వెలగబెట్టినప్పుడు సరదాగా పన్ను పీకించుకోడానికి కూడా విదేశాలకు జనం సొమ్ముతో వెళ్లిన ఆర్థిక మేథావులు ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. ఆ లెక్కల మర్మమేంటి..? పర్యటనల విషయంలో జగన్ కి, చంద్రబాబుకి అసలు పోలిక ఏమైనా ఉందా..? కూతురిని చూసేందుకు, అది కూడా ప్రైవేట్ పర్యటనకోసం సీఎం జగన్ వెళ్తే ఈనాడుకి కడుపుమంట ఎందుకని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. పెదబాబు, చినబాబు లెక్కలు బయటకొస్తే.. పేదల పక్షపాతి ఎవరో కచ్చితంగా బయటపడుతుందని అంటున్నారు నెటిజన్లు.

సాక్షి ఖండన ఏంటి..?

ఈనాడులో వస్తున్న ప్రతి వార్తకు సాక్షిలో ఖండన రావడం సహజంగా మారింది. మరి ఈ చార్టర్డ్ ఫ్లైట్ అంశంపై సాక్షి ఖండన ఎలా ఉంటుందో చూడాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ప్రయాణించిన వాహనాలు, వాటి విలువ అంటూ అటునుంచి సమాధానం వస్తుందా..? లేక జగన్ ఏ విమానంలో వెళ్తే మీకెందుకు అంటూ ఏకవాక్య తీర్మానం చేస్తుందా..? వేచి చూడాలి. వాస్తవానికి సాక్షికి ఈనాడు ఓ అద్భుతమైన ఆయుధాన్ని అందించింది. దాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు లెక్కలన్నీ బయటకు తీసే అవకాశం వారికి దొరికినట్టే లెక్క. కానీ ఈమధ్య ఎదురుదాడిలో జగన్ మీడియా బాగా వెనకపడినట్టు తెలుస్తోంది. ఈ సారి కూడా ఎదుటి వారి విమర్శలు మాత్రమే కాచుకుంటారా, లేక ప్రతి విమర్శలు ఘాటుగా చేస్తారా అనేది చూడాలి.

First Published:  7 Sept 2023 5:32 AM GMT
Next Story