ఆఖరికి గుడిలోనూ రాజకీయాలా రామోజీ..!
పూజారులు ఈవోకి ఇచ్చిన ఫిర్యాదుని హైలైట్ చేస్తూ ఎల్లో మీడియా మరింత రెచ్చిపోయింది.
సీఎం జగన్ ను హిందూ మత ద్వేషి అని చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా నానా తంటాలు పడుతోంది. గతంలో జగన్ సతీసమేతంగా ఆలయాలకు వెళ్లరని నిందలు వేసేవారు, పోనీ భార్యా భర్తలిద్దరూ కలసి పూజలు చేస్తే ప్రసాదం తీసుకోవడం చేతకాలేదని వార్తలిచ్చేవారు. చిత్ర విచిత్ర మైన విషయాలను హైలైట్ చేస్తూ వికృత రాజకీయ క్రీడ మొదలు పెట్టారు. ఇక బీజేపీ కూడా టీడీపీతో జతకలిసి కూటమిలో చేరిన తర్వాత జగన్ పై ఈ దాడి మరింత ఉధృతమైంది. కాకినాడ ఆలయంలో జరిగిన ఓ ఘటనను వైసీపీకి అంటకడుతూ ఈనాడులో వచ్చిన వార్త రామోజీ బురదజల్లుడు కార్యక్రమానికి పరాకాష్ట.
అసలేం జరిగింది..?
కాకినాడలోని పెద్ద శివాలయంలో పౌర్ణమి రోజున పూజల రద్దీలో ఓ వ్యక్తి ఆలయ పూజారిపై చేయి చేసుకున్నాడని, దూషించాడని, అంతు చూస్తానన్నాడనేది వార్త. సదరు వ్యక్తికి వైసీపీతో వేలు విడిచిన దూరపు చుట్టరికం ఉండటం ఎల్లో మీడియాకు ఆసక్తిగా కనపడింది. ఇంకేముంది వార్త స్వరూపం మారిపోయింది. 'గుడిలో పూజారిపై వైసీపీ నేత దాడి' అంటూ కథలల్లింది. ఆ పాపాన్నంతా వైసీపీ ఖాతాలో వేయాలనుకుంది.
పూజారిని కొట్టారంటూ ఈనాడు ఆరోపిస్తున్న సిరియాల చంద్రరావు వైసీపీలో యాక్టివ్ నాయకుడు కారు. మాజీ కార్పొరేటర్ మాత్రమే. అంత మాత్రాన ఆయన చేసిన పనికి వైసీపీని దూషిస్తూ వార్తలు రాయడం ఎంతవరకు సమంజసం. ఇటీవల కాలంలో వ్యక్తిగత దాడులను కూడా వైసీపీ ఖాతాలో వేస్తూ జగన్ ఇమేజ్ డ్యామేజీ చేయడానికి ప్రయత్నిస్తోంది ఎల్లో మీడియా. కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో ఆత్మహత్యలు జరిగినా దాన్ని వైసీపీ ప్రభుత్వ అసమర్థతగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికల వేళ ఇలాంటి ప్రయత్నాలు మరింత ఎక్కువ అయ్యాయి. అందులో భాగమే గుడిలో పూజారిపై వైసీపీ దాడి అనే కథనం. గతంలో ఆంధ్రజ్యోతిలో ఇలాంటి చీప్ టెక్నిక్స్ పాటించేవారు, ఇప్పుడు ఈనాడు అంతకు మించి బరితెగించేసింది.