Telugu Global
Andhra Pradesh

ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడీ సోదాలు.. డైరెక్టర్ల మధ్య పలు వివాదాలు!

ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ సీట్ల కేటాయింపులో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఆసుపత్రి నిర్వహణలో డైరెక్టర్ల మధ్య వివాదాలు ఉన్నాయి.

ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడీ సోదాలు.. డైరెక్టర్ల మధ్య పలు వివాదాలు!
X

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఇవ్వాళ ఉదయం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్లు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎన్ఆర్ఐ ఆసుపత్రికి సంబంధించి పలు వివాదాలు బయటకు వచ్చాయి. సొసైటీ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రి, అనుబంధ మెడికల్ కాలేజీకి సంబంధించి డైరెక్టర్ల మధ్య పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అకస్మాతుగా ఈడీ దాడులు చేయడం, పైగా ఏపీ పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆసుపత్రి, కాలేజీతో పాటు డైరెక్టర్ ఇళ్లలో కూడా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఈ దాడుల్లో మొత్తం నాలుగు టీమ్స్ పాల్గొన్నాయి.

ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఒక మెడికల్ కాలేజీ కూడా ఉన్నది. ఆ కాలేజీ సీట్ల కేటాయింపులో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఆసుపత్రి నిర్వహణలో డైరెక్టర్ల మధ్య వివాదాలు ఉన్నాయి. దీంతో వాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారు. గత ఏడాది జూన్‌లో ఎన్ఆర్ఐ ఆసుపత్రి డైరెక్టర్లు ముక్కామల అప్పారావు, నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌లు రెండుగా విడిపోయి.. ఎవరికి వారే కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. తనకు 19 మంది మద్దతు ఉందని అప్పారావు, 17 మంది మద్దతు ఉందని ఉపేంద్ర ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. 19 మంది మద్దతు ఉందని ప్రకటించుకున్న అప్పారావు.. ఇటీవల ఆసుపత్రిని ఓ ప్రముఖ కంపెనీకి అమ్మేయాలనే ప్రతిపాదన చేశారు. కానీ, డైరెక్టర్ల మధ్య ఉన్న వివాదాల కారణంగా ఆ డీల్ కుదరలేదు.

మెడికల్ కాలేజీకి చెందిన సీట్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో భారీగా డొనేషన్లు కూడా వసూలు చేసినట్లు సమాచారం. మరోవైపు సొసైటీగా రిజిస్టర్ అయిన ఎన్ఆర్ఐ ఆసుపత్రి పేరుతో విదేశాల నుంచి విలువైన పరికరాలు కొనుగోలు చేసి.. వాటిని ఆసుపత్రి డైరెక్టర్లలో ఒకరైన డాక్టర్ అక్కినేని మణి విజయవాడలోని తన ఆసుపత్రిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మణితో పాటు డైరెక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్ర, చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఉప్పల శ్రీనివాసరావు, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ నళిని మోహన్‌లు కూడా భారీగా అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తున్నది.

నకిలీ ఇన్వాయిస్‌లు ఉపయోగించి ఎన్‌ఆర్ఐకి చెందాల్సిన నిధులను పక్కదోవ పట్టించినట్లు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించిన అవకతవకలపై పోలీసులు ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈడీ విచారణలో మరోసారి ఆ వివాదాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈడీ సోదాల నేపథ్యంలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. బయటి నుంచి ఎవరినీ కార్యాలయాల లోపలికి అనుమతించడం లేదు.

First Published:  2 Dec 2022 3:12 PM IST
Next Story