మాగుంట కుటుంబానికి మరో షాక్..
ఈడీ కేసుల వ్యవహారం ఏపీలో మాగుంట కుటుంబానికి తలనొప్పిగా మారింది. 2024లో ఆ ఫ్యామిలీ తరపున ఎవరు పోటీ చేసినా, ఈ కేసుల వ్యవహారంలో చికాకులు తప్పవనే చెప్పాలి.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న మాగుంట కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈనెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాసులరెడ్డికి నోటీసులివ్వడం చర్చనీయాంశమవుతోంది.
మాగుంట కుటుంబం చాన్నాళ్లుగా లిక్కర్ బిజినెస్ లో ఉంది. ఏపీలో లిక్కర్ తయారీ కంపెనీలు వారికి ఉన్నాయి. హోల్ సేల్ బిజినెస్ లో ఉన్న ఆ కుటుంబం ఢిల్లీ మద్యం టెండర్ల విషయంలో రిటైల్ బిజినెస్ కోసం ప్రయత్నించినట్టు, అందులో భాగంగా ముడుపులు చేతులు మారినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఏపీకి చెందిన ఇద్దరు ఎంపీల కుటుంబ సభ్యులు అరెస్ట్ కావడం విశేషం. అందులో ఒకరు ఒంగోలు ఎంపీ శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి.
పొలిటికల్ షాక్..
మాగుంట శ్రీనివాసులరెడ్డి 2024 ఎన్నికల్లో తన తనయుడు రాఘవరెడ్డిని తెరపైకి తేవాలనుకున్నారు. ఒంగోలు నుంచి లేదా, నెల్లూరు నుంచి రాఘవరెడ్డిని లోక్ సభకు పోటీకి దింపాలనుకున్నారు. ఆయన వైసీపీలో ఉంటారా, లేక టీడీపీకి వెళ్తారా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. రాఘవరెడ్డి అరెస్ట్ పై ఇప్పటి వరకూ వైసీపీ పెద్దలెవరూ స్పందించలేదు, ఇప్పుడు శ్రీనివాసులరెడ్డి నోటీసుల వ్యవహారంలో కూడా ఎవరూ కామెంట్ చేయలేదు. ఈడీ కేసుల వ్యవహారం ఏపీలో మాగుంట కుటుంబానికి తలనొప్పిగా మారింది. 2024లో ఆ ఫ్యామిలీ తరపున ఎవరు పోటీ చేసినా, ఈ కేసుల వ్యవహారంలో చికాకులు తప్పవనే చెప్పాలి. రాఘవరెడ్డి పొలిటికల్ ఎంట్రీకి కూడా ఇది అడ్డుపుల్లగా మారే అవకాశముంది.
పార్టీ పట్టించుకుంటుందా..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిపించే సందర్భంలో వైసీపీ నుంచి ఫుల్ సపోర్ట్ ఆయనకు ఉంది. సీబీఐ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని, తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరుపుతోందనే ఆరోపణలు నేరుగా పార్టీ నుంచే వినిపించాయి. పార్టీ అనుబంధ మీడియా కూడా ఈ వ్యవహారంలో సీబీఐనే తప్పుబడుతూ కథనాలనిచ్చింది. ఇటు మాగుంట ఎపిసోడ్ లో మాత్రం అందరూ సైలెంట్ గా ఉన్నారు. కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడంలేదు. చివరకు ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.