Telugu Global
Andhra Pradesh

రఘురామరాజుకు భారీ జరిమానా?

ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.40 కోట్ల పెనాల్టీ కట్టాలని నవంబర్ 3న ఎంపీకి నోటీసులు జారీ చేసింది ఈడీ. 45 రోజుల్లోనే పెనాల్టీ చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

రఘురామరాజుకు భారీ జరిమానా?
X

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందనే సామెత చాలా పాపులర్. ఇప్పుడీ సామెత ఎందుకంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురించే. ఇంతకీ విషయం ఏమిటంటే రఘురామరాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది. ఈడీ పెనాల్టీని చాలెంజ్ చేస్తు రఘురామరాజు తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఈడీ ప్రొసీడింగ్స్ ను నిలిపేయటానికి హైకోర్టు అంగీకరించలేదు. కాకపోతే కేసుకు సంబంధించిన వివరాలతో పిటీషన్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీచేసింది.

అసలు విషయం ఏమిటంటే ఎంపీకి ఇండ్ - భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది. తన సంస్థ‌ కోసమని 2011లో మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ. 202 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే రూ. 200 కోట్లను ఇండ్ - భారత్ ఎనర్జీ లిమిటెడ్(ఉత్కళ్) కు రాజు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్స్ చేంజ్ మైన్‌టెనెన్స్ యాక్ట్(ఫెమా) దృష్టిలో పడింది. దాంతో విషయాన్ని లోతుల్లోకి పరిశీలించిన ఫెమా అధికారులు మారిషస్ కంపెనీ నుండి ఎంపీకి చెందిన కంపెనీ రూ.202 కోట్లు ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి అందినట్లు గుర్తించారు. అలాగే మరుసటి రోజే ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్‌కు బదలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు.

దీనిపై అనేక కోణాల్లో దర్యాప్తు జరిపిన ఉన్నతాధికారులు విషయం మొత్తాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో మళ్ళీ మరోసారి వ్యవహారంపై దర్యాప్తు జరిపి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించుకున్న ఈడీ.. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.40 కోట్ల పెనాల్టీ కట్టాలని నవంబర్ 3న ఎంపీకి నోటీసులు జారీ చేసింది. 45 రోజుల్లోనే పెనాల్టీ చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

ఈడీ నుండి పెనాల్టీ కట్టమని నోటీసులు అందగానే వెంటనే హైకోర్టులో పిటీషన్ వేశారు ఎంపీ. ఈడీ నోటీసుల‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టే ఇవ్వాలని కోరారు. అయితే రఘురామరాజు అడిగినట్లు కోర్టు స్టే ఇవ్వలేదు. కాకపోతే కేసు వివరాలతో వెంటనే రిప్లై పిటీషన్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీచేసింది. మరి డిసెంబర్ 1న జరగబోయే విచారణలో కోర్టు ఏమంటుందో చూడాలి.


First Published:  26 Nov 2023 10:09 AM IST
Next Story