వలంటీర్లపై ఈసీ ఆంక్షలు
ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో నియమితులైన వలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని, వారు ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఆత్మకూరు, బద్వేలు ఉప ఎన్నికల సమయంలోనూ అనేక ఫిర్యాదులు ఈసీకి వెళ్లాయి. దాంతోపాటు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు వలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలే అంటూ చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను ఈసీకి ఫిర్యాదుల రూపంలో పలువురు పంపించారు. వీటిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఏ ఒక్క ఎన్నికల విధుల్లో కూడా వలంటీర్లను భాగస్వాములను చేయవద్దని ఆదేశించింది.
అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ ఆదేశాలను రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు వెంటనే తెలియజేయాలని, తప్పనిసరిగా ఈ ఆదేశాలు అమలు అయ్యేలా చూడాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, పోలింగ్ రోజు ఓటర్లకు చీటీలు పంపిణీ, ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికలకు సంబంధించిన ఏ విధుల్లో కూడా వలంటీర్లను భాగస్వాములను చేయవద్దని స్పష్టం చేసింది ఈసీ.