ఏపీలో ముందస్తు ఎందుకు..?
ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వినిపించాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ వార్తల్ని కొట్టిపారేసేవారు. ఈసారి జగన్ ఢిల్లీ పర్యటనతో మరోసారి ముందస్తు వ్యవహారం హైలెట్ గా మారింది.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అంటేనే.. ఇక్కడ ఆయన వైరి వర్గం మీడియా రకరకాల పుకార్లు మొదలు పెడుతుంది. ఈసారి మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్.. ఇలా ముగ్గురు కీలక వ్యక్తుల్ని కలిశారు జగన్. అందులో ప్రధాని మోదీతో గంటకు పైగా చర్చలు జరిగాయి. ఇంతకీ ఆ చర్చల సారాంశం ఏంటి..? రాష్ట్రానికి నిధులు అడగటం, బకాయిలను గుర్తు చేయడం వంటివి సహజమే. అయితే అంతకు మించి అక్కడేదో జరిగిందని, అది ముందస్తు ఎన్నికల మహూర్తంపై చర్చ అనే పుకార్లు వ్యాపించాయి.
ముందస్తు అవసరమేంటి..?
పోనీ ఆ పుకార్లే వాస్తవం అనుకుందాం. అసలు ఏపీలో ముందస్తు ఎన్నికల అవసరం ఏంటి..? 151 సీట్ల సాలిడ్ విజయం ఆ తర్వాత ఐదుగులు ప్లస్, నలుగురు మైనస్... ఇదీ ప్రస్తుతం ఏపీలో వైసీపీ పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీదే ఘన విజయం అంటున్నాయి సర్వేలు. పోనీ టైమ్ గడిస్తే ప్రతిపక్షం బలపడుతుందా అంటే అలాంటి సంకేతాలేవీ లేవు. మరి జగన్ ఎందుకు తొందరపడతారు, దేనికి ఆవేశపడతారు. ముందస్తుకి వెళ్తే జగన్ భయపడ్డారనే ప్రచారం కూడా మొదలవుతుంది. అందుకే ఆయన ఎక్కడా తొందరపడుతున్నట్టుగా లేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం లేని తొందరని జగన్ కి ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలతో కలిపి ఏపీకి కూడా ఎలక్షన్ జరపాలని జగన్ మోదీని అడిగినట్టు, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. ఆ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి తెరపైకొచ్చారు. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చారు. అసలు ప్రధానితో భేటీలో ముందస్తు అంశమే చర్చకు రాలేదని, నిధుల కోసమే జగన్ వినతిపత్రాలిచ్చారని చెప్పుకొచ్చారు. దీనిపై రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా కామెంట్ చేశారు. ఏపీలో ముందస్తు ఖాయమని, కావాలనే వైసీపీ ముందుగా లీకులిచ్చిందని, ఆ తర్వాత వ్యూహం ప్రకారమే ఆ వార్తల్ని కొట్టిపారేశారని అన్నారాయన.
ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వినిపించాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ వార్తల్ని కొట్టిపారేసేవారు. ఈసారి జగన్ ఢిల్లీ పర్యటనతో మరోసారి ముందస్తు వ్యవహారం హైలెట్ గా మారింది.