పిఠాపురానికి డిప్యూటీ సీఎం.. పర్యటన ఖరారు
పిఠాపురంను దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన పవన్.. ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు.
గాజువాక, భీమవరం నుంచి గతంలో అవకాశం లభించకపోయినా, ఈసారి పిఠాపురంపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. పిఠాపురం వాసులు ఆయన నమ్మకాన్ని నిజం చేశారు, భారీ మెజార్టీ ఇచ్చారు. ఘన విజయాన్నిచ్చిన పిఠాపురం వాసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టినా, కీలక నేతలకు నియోజకవర్గ గెలుపు బాధ్యతలు అప్పజెప్పినా ప్రజలు మాత్రం పవన్ కి జై కొట్టడం విశేషం.
పిఠాపురానికి భారీ హామీలు..
తాను గెలిస్తే పిఠాపురం నియోజకవర్గం రూపు రేఖలు మార్చేస్తానంటూ భారీ హామీలు ఇచ్చారు పవన్ కల్యాణ్. తాగునీటి వసతి సహా చాలా హామీలు నెరవేర్చాల్సి ఉంది. ఇటీవల ఈ హామీలపై నాగబాబు స్థానిక నేతలతో సమావేశమై చర్చించారు. ఆ హామీలన్నీ వీలైనంత త్వరగా నెరవేరుస్తారని భరోసా కల్పించారు. ఈ క్రమంలో జులై-1నుంచి మూడు రోజులపాటు పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ని జనసేన అధికారికంగా ప్రకటించింది.
1వ తేదీ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి పిఠాపురం పర్యటన
— JanaSena Party (@JanaSenaParty) June 25, 2024
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జులై 1వ తేదీ నుంచి తన పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం…
జులై 1 నుంచి మూడు రోజులపాటు పవన్ పిఠాపురంలో పర్యటిస్తారు. మొదటి రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తారు. తర్వాతి రెండు రోజులు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై నేతలతో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశం కాబోతున్నారు. పిఠాపురంను దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన పవన్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.