Telugu Global
Andhra Pradesh

ఆడపిల్లల మిస్సింగ్.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం తలచుకుంటే ఇలాంటి కేసులన్నీ వెంటనే పరిష్కరించగలదని, కానీ గత ఐదేళ్లలో ఎంతో మంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు పవన్.

ఆడపిల్లల మిస్సింగ్.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

ఏపీలో ఆడపిల్లల మిస్సింగ్ పై ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, వుమెన్ ట్రాఫికింగ్ ని అడ్డుకోవడంలేదని.. పరోక్షంగా వాలంటీర్ వ్యవస్థపై కూడా విమర్శలు సంధించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ ని ప్రతిపక్ష వైసీపీ టార్గెట్ చేసింది. అప్పుడు వేలాదిమంది మిస్ అయ్యారని చెప్పిన పవన్, ఇప్పుడు వారి ఆచూకీ కనిపెట్టారా అంటూ సోషల్ మీడియాలో చాలామంది వెటకారం చేశారు. వాటికి సమాధానం అన్నట్టుగా ఈరోజు పవన్ ప్రెస్ మీట్ పెట్టి ఆడపిల్లల మిస్సింగ్ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం తొలి విజయం సాధించిందని చెప్పారు.


ఆడపిల్లల భద్రతపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఇటీవల జరిగిన ఓ ఘటనను మీడియాకు వివరించారు. తన కూతురు కిడ్నాప్ కి గురైందని, 9 నెలలుగా ఆచూకీ తెలియడంలేదని ఓ మహిళ పవన్ కల్యాణ్ కు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తీసుకున్న పవన్ వెంటనే పోలీసుల్ని అలర్ట్ చేశాంరు. పోలీసులు ఇతర రాష్ట్రాల్లో కూడా గాలింపు చేపట్టారు. అక్కడి పోలీసులకు ఆమె వివరాలు పంపించి వెదికే ప్రయత్నం చేశారు. వారి సెర్చ్ ఆపరేషన్ ఫలించింది. ఆ అమ్మాయి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నట్టు తెలిసింది. ఆమెను ఇప్పుడు ఏపీకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

9 నెలల క్రితం కనిపించకుండా పోయిన యువతిని.. కేవలం 48 గంటల్లో పోలీసులు వెదికి గుర్తించడం అరుదైన విషయం అన్నారు పవన్ కల్యాణ్. ప్రభుత్వం తలచుకుంటే ఇలాంటి కేసులన్నీ వెంటనే పరిష్కరించగలదని, కానీ గత ఐదేళ్లలో ఎంతో మంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు పవన్. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆడపిల్లల అదృశ్యంపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు పవన్.

First Published:  2 July 2024 11:17 AM GMT
Next Story