Telugu Global
Andhra Pradesh

కాకినాడ పోర్టుపై పవన్ కక్ష..! వైసీపీ వాదనలో నిజమెంత..?

ద్వారంపూడి అక్రమాలను బయటపెడుతున్నామని ప్రభుత్వం అంటుంటే, కాకినాడ పోర్ట్ పై కక్ష తీర్చుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

కాకినాడ పోర్టుపై పవన్ కక్ష..! వైసీపీ వాదనలో నిజమెంత..?
X

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కూటమి ప్రభుత్వం పూర్తిగా టార్గెట్ చేసిందనేమాట వాస్తవం. కూటమి ప్రభుత్వం అనడం కంటే, ప్రత్యేకంగా జనసేన ఈ టాస్క్ ని మొదలు పెట్టింది. జనసేన నేత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై దాడులు చేస్తూ ఆ గోడౌన్లకు ద్వారంపూడి కుటుంబానికి ఉన్న సంబంధాలను బయటపెట్టారు. మరోవైపు ద్వారంపూడి ఫ్యామిలీకి చెందిన కంపెనీల పర్యావరణ నిబంధనలపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ద్వారంపూడి కుటుంబానికి చెందిన వీరభధ్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు పీసీబీ అధికారులు ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలిచ్చారు. ద్వారంపూడి సంస్థ నిబంధనలను ఉల్లంఘించడంపై లోతుగా విచారణకు పవన్ ఆదేశాలిచ్చారు. మరోవైపు కాకినాడలో అక్రమ నిర్మాణం కూల్చివేత విషయంలో గొడవ చేశారంటూ ద్వారంపూడిపై కేసు కూడా నమోదైంది. మొత్తానికి ద్వారంపూడికి అన్నివైపుల నుంచి ద్వారాలు మూసుకు పోయేలా చేశారు, ఉచ్చు బిగించేస్తున్నారు.


జనసేన ద్వారంపూడిని టార్గెట్ చేస్తున్న క్రమంలో కాకినాడ పోర్టు పేరు నాశనం అవుతోందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. పీడీఎస్‌ బియ్యం అక్రమ మార్గంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారనే సాకుతో కాకినాడ పోర్టుకి చెడ్డ పేరు వచ్చేలా నిందలు వేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ద్వారంపూడిపై మంత్రి నాందెడ్ల మనోహర్‌ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కాకినాడ రేవును వదిలి గాండ్ల, పారాదీప్‌ ఓడరేవులవైపు ఎగుమతిదారులు మొగ్గుచూపుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల పోర్టుపై ఆధారపడిన 10వేల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందంటున్నారు.


కాకినాడ పోర్ట్ పై వైసీపీ చేసిన ట్వీట్ పై అప్పుడే ట్రోలింగ్ మొదలైంది. తప్పు చేస్తున్న ద్వారంపూడిని వదిలేయాలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ద్వారంపూడి తప్పు చేశారా, ఒప్పుచేశారా అనేది విచారణలో తేలుతుంది. ప్రస్తుతం ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కచ్చితంగా ఇది రాజకీయ కక్షసాధింపే అని వైసీపీ ఆరోపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పాపాలన్నీ ఇప్పుడు పండాయని జనసేన నేతలు అంటున్నారు.

ఎన్నికల సమయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కల్యాణ్ మధ్య మాటల తూటాలు ఓ రేంజ్ లో పేలాయి. అధికారంలోకి వచ్చాక ద్వారంపూడి సంగతి తేలుస్తానంటూ పవన్ కూడా హెచ్చరించారు. అయితే ఆ ఆపరేషన్ ఆయన ఇంత త్వరగా మొదలు పెడతారని ఎవరూ ఊహించలేదు. ద్వారంపూడి అక్రమాలను బయటపెడుతున్నామని ప్రభుత్వం అంటుంటే, కాకినాడ పోర్ట్ పై కక్ష తీర్చుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ రెండిటిలో నిజమెంతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

First Published:  5 July 2024 10:29 PM IST
Next Story