Telugu Global
Andhra Pradesh

పవన్‌ను రెండు వైపులా వాయించేస్తున్నారా?

వచ్చే ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోటీచేసి తనను ఓడించాలని ద్వారంపూడి నాలుగు రోజుల క్రితం చాలెంజ్ చేస్తే.. పవన్ నుండి సమాధానం లేదు. ఇంతలో ముద్రగడ తయారయ్యారు.

పవన్‌ను రెండు వైపులా వాయించేస్తున్నారా?
X

రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారో తేల్చుకోలేని పవన్ కల్యాణ్‌ను దమ్ముంటే తమ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఇద్దరు నేతలు చాలెంజ్‌లు విసురుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరేమో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మరోకరేమో ముద్రగడ పద్మనాభం. వచ్చే ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోటీచేసి తనను ఓడించాలని ద్వారంపూడి నాలుగు రోజుల క్రితం చాలెంజ్ చేస్తే.. పవన్ నుండి సమాధానం లేదు. ఇంతలో ముద్రగడ తయారయ్యారు.

రాబోయే ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేసే ధైర్యముందా? తనను ఓడించగలననే నమ్మకం ఉందా? అని కవ్విస్తున్నారు. పవన్‌కు దమ్ము, ధైర్యముంటే పిఠాపురంలో పోటీచేసి ఓడించాలని పవన్‌కు రాసిన రెండో లేఖలో సవాలు విసిరారు. అయితే దీనికి కూడా పవన్ నుండి సమాధానం ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు. ఓడిపోతాననే భయంతోనే రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేసే విషయాన్ని కూడా పవన్ దాచిపెడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి రూ. 200 కోట్లు ఖర్చుచేయటానికి రెడీగా ఉన్నట్లు వారాహి యాత్రలో పవనే చెప్పారు. అందుకనే వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తాననే నమ్మకం లేదని కూడా అన్నారు. మరి పోటీ చేస్తే గెలుస్తాననే నమ్మకం కూడా లేనప్పుడు వారాహి యాత్రలు, పనికిమాలిన చాలెంజ్‌లు పవన్‌కు అవసరమా? నిజానికి ద్వారంపూడి అయినా ముద్రగడ అయినా ఓటమెరుగని నేతలేమీ కాదు. మూడుసార్లు పోటీచేసిన ద్వారంపూడి ఒకసారి ఓడిపోయారు. నాలుగుసార్లు పోటీచేసిన ముద్రగడ ఒకసారి ఓడిపోయారు. అయితే ఇద్దరూ కూడా బలమైన నేతలే.

ఇక్కడ సమస్య ఏమిటంటే అనవసరంగా పవన్ వీళ్ళిద్దరిని కెలికారు. దాంతో ఇద్దరూ చెరో వైపు పవన్‌ను వాయించేస్తున్నారు. మామూలుగా అయితే పార్టీ అధినేతగా పవన్ ఏ నియోజకవర్గంలో నామినేషన్ వేసినా గెలిచిపోవాలి. కానీ 2019లో రెండుచోట్లా ఓడిపోయి 2024లో కూడా గెలుపుపై నమ్మకం లేదని బహిరంగంగానే చెబుతున్నారంటే పవన్ మానసిక పరిస్థితి ఏమిటో అర్థ‌మైపోతోంది. అందుకనే చెరో వైపు వాయించేస్తున్నా పవన్ సమాధానం చెప్పలేకపోతున్నారు. చూస్తుంటే తూర్పు గోదావరిలో పవన్ ఎక్కడ పోటీ చేస్తే ముద్రగడ అక్కడ నామినేషన్ వేసేట్లున్నారు.

First Published:  24 Jun 2023 11:20 AM IST
Next Story