వచ్చేస్తున్నారు డ్రోన్ పైలట్లు.. ఏపీలో కొత్త ఉపాధి
ఆర్బీకేల ద్వారా డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తేవాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ద్వారా నిరుద్యోగులకు కూడా కొత్త ఉపాధి మార్గం దొరికినట్టవుతుందని చెబుతున్నారు అధికారులు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగాలు సృష్టించారు. నెలకు 5వేల గౌరవ వేతనం తీసుకునే వాలంటీర్ వ్యవస్థ కూడా సీఎం జగన్ ప్రవేశపెట్టిందే. ఇప్పుడు కొత్తగా డ్రోన్ పైలట్లను తయారు చేస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 80వేలమంది డ్రోన్ పైలట్లకు అవకాశాలున్నాయని చెబుతున్న ప్రభుత్వం రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లో వీరికి నియామకాలు ఉంటాయని తెలిపింది.
వ్యవసాయంతోపాటు ఇతర రంగాల్లో కూడా డ్రోన్ల వాడకం విరివిగా పెరిగింది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో సాగుకోసం కూలీలు పెద్ద సంఖ్యలో అవసరం అవుతారు. కానీ రోజురోజుకీ కూలీల సంఖ్య తగ్గడంతో వారికి డిమాండ్ పెరిగింది, తద్వారా కూలీ రేట్లు కూడా భారీగానే పెరిగాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో 10వేల డ్రోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తొలి దశలో జులైలోగా 500 ఆర్బీకేల్లో డ్రోన్లు అందుబాటులోకి తెస్తారు. డ్రోన్లతోపాటు వాటి వినియోగం తెలిసిన డ్రోన్ పైలట్లను కూడా గ్రామాలనుంచే శిక్షణ ద్వారా తయారు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 12రోజుల సర్టిఫికెట్ కోర్స్ అందిస్తోంది.
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రం సెంటర్ ఫర్ అప్సరా ద్వారా సంప్రదాయ వ్యవసాయ డ్రోన్ల రిమోట్ పైలట్ ట్రైనింగ్ కోర్సు ప్రారంభించారు. 12 రోజులపాటు ఇక్కడ రైతులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 8 బ్యాచ్‌లలో 135 మంది రైతులకు శిక్షణనిచ్చారు. మిగిలిన వారికి జులైనాటికి శిక్షణ పూర్తి చేయాలని భావిస్తున్నారు.
వ్యవసాయంలో డిప్లొమా, లేదా ఏదైనా ఇంజినీరింగ్ చదివిన యువతకు కూడా డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తారు. కనీసం 3 ఏళ్ల పాటు ఆర్బీకేల్లో పని చేసేందుకు ఇష్టపడితేనే వారికి శిక్షణ ఉచితంగా ఇస్తారు. లాం లోని అప్సరా కేంద్రంతో పాటు తిరుపతి, కడప, విజయనగరంలో కూడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. మాస్టర్ ట్రైనర్లను నియమిస్తున్నారు.
రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో డ్రోన్లదే కీలక పాత్ర. ఎరువులు, పురుగు మందుల పిచికారీ, ఇతర అవసరాలకు రైతులు ఇప్పటికే డ్రోన్ల వాడకం మొదలు పెట్టారు. డ్రోన్లతో వ్యవసాయ రంగంలో దాదాపు 22 రకాల పనులు చేయొచ్చు. ఆర్బీకేల ద్వారా డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తేవాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ద్వారా నిరుద్యోగులకు కూడా కొత్త ఉపాధి మార్గం దొరికినట్టవుతుందని చెబుతున్నారు అధికారులు.