Telugu Global
Andhra Pradesh

బ్రాహ్మణులు వర్సెస్ కాపులు.. గరికపాటి ఎపిసోడ్ లో ట్విస్ట్

గరికపాటిపై నాగబాబు చేసిన వ్యాఖ్యల్ని బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ ఖండించారు. నాగబాబుకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

బ్రాహ్మణులు వర్సెస్ కాపులు.. గరికపాటి ఎపిసోడ్ లో ట్విస్ట్
X

గరికపాటి వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ ఇది. ఈ వివాదం కులం రంగు పులుముకుంది. గరికపాటిపై నాగబాబు చేసిన వ్యాఖ్యల్ని బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ ఖండించారు. నాగబాబుకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సనాతనవాదిని, ఆధ్యాత్మిక వేత్తను ఇలా అగౌరవ పరచడం సరికాదన్నారు. "నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని ఎంతో సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతన వాది, ఆధ్యాత్మిక వేత్త.. నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే" అని ఘాటుగా స్పందించారు.

గరికపాటిపై వచ్చిన విమర్శలకు బ్రాహ్మణ ఫెడరేషన్ స్పందించడంతో ఈ వ్యవహారం కాపు వర్సెస్ బ్రాహ్మిణ్ అనే మలుపు తిరిగింది. గరికపాటికి జరిగిన అవమానాన్ని బ్రాహ్మణులకు జరిగిన అవమానంగా వారు భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత కలకలం రేపుతోంది. ఊహించని ఈ ప్రతిస్పందనలతో నాగబాబు మరోసారి ట్విట్టర్లో స్పందించారు. "గరికపాటి వారు ఏదో మూడ్‌ లో అలా అని ఉంటారు. ఆయనలాంటి పండితుడు అలా అని ఉండకూడదని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలే గానీ, ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని రెక్వెస్ట్‌" అని ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్..

అటు చిరంజీవి అభిమానులు, కొంతమంది జనసైనికులు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. గరికపాటిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గరికపాటి క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్‌ ఆయనకు ఫోన్‌ చేసి డిమాండ్‌ చేశారని తెలుస్తోంది. సినీనటుడు ఉత్తేజ్‌ కూడా ఈ విషయంపై స్పందించారు. గరికపాటి అలా అనకూడదని హితవుపలికారు.

గతంలో పోసాని, ఇప్పుడు గరికపాటి..

గతంలో పోసాని కృష్ణమురళి, పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో అప్పట్లో పెద్ద దుమారం రేగింది. పోసానికి సోషల్ మీడియాలో చుక్కలు చూపించారు జనసైనికులు. విపరీతమైన ట్రోలింగ్ తర్వాత‌ ఆ ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు గరికపాటిపై జనసైనికులు, మెగా అభిమానులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. విచిత్రం ఏంటంటే అటు చిరంజీవి కానీ, ఇటు గరికపాటి కానీ ఈ గొడవపై స్పందించలేదు. వారిద్దరూ సైలెంట్ గా ఉన్నారు. మధ్యలో ఉన్న వారే మాటల మంటలకు ఆజ్యం పోస్తున్నారు.

First Published:  8 Oct 2022 5:23 AM GMT
Next Story