సెల్‌ఫోన్‌లో క్రికెట్ చూస్తూ రైలు నడిపిన డ్రైవర్లు.. కంటకాపల్లి ప్రమాదానికి కారణమదే
గత ఏడాది అక్టోబర్ 29న కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న రాయగడ ప్యాసింజర్ రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ- పలాస ప్యాసింజర్ ఢీకొట్టింది.
సెల్‌ఫోన్ డ్రైవింగ్ నిషేధం అని ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తుంటారు. కానీ, ఏకంగా రైలు డ్రైవర్లు సెల్‌ఫోన్‌లో క్రికెట్ చూస్తూ రైలు నడిపి ఘోరప్రమాదానికి కారణమయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ఘోరప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని తేలింది. ఏకంగా లోకోపైలెట్ సెల్‌ఫోన్‌లో క్రికెట్ చూస్తూ రైలు నడపడం వల్లే ఈప్రమాదం జరిగిందని సాక్షాత్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరిన్ని సురక్షా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
14 మంది మృత్యువాత, 50 మందికి గాయాలు
గత ఏడాది అక్టోబర్ 29న కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న రాయగడ ప్యాసింజర్ రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ- పలాస ప్యాసింజర్ ఢీకొట్టింది. అదే ట్రాక్ మీద ఆగి ఉన్న బండిని చూడకుండా పలాస ప్యాసింజర్ రైలు లోకోపైలెట్ ఫోన్‌లో క్రికెట్ చూస్తూ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మంత్రి చెప్పారు. ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలవ్వగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
తూతూమంత్రం చర్యలేనా?
నివేదిక రాకముందు ఈ ఇద్దరు డ్రైవర్లపై చర్యలు తీసుకున్నామని కేంద్రమంత్రి ప్రకటించారు. అయితే విధుల్లో ఒళ్లు మరిచి, ఫోన్లో క్రికెట్ చూస్తూ ఘోరప్రమాదానికి కారణమైన వారిపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.