Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు మీద డబుల్ లోడ్ తప్పదా..?

ఈ నేపథ్యంలోనే ఒకవైపు తమ్ముళ్ళు పోటీచేస్తున్న నియోజకవర్గాలను చూసుకోవాలి అలాగే మరోవైపు జనసేన అభ్యర్థుల నియోజకవర్గాలను గమనిస్తుండాలి.

చంద్రబాబు మీద డబుల్ లోడ్ తప్పదా..?
X

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మీద డబుల్ లోడ్ తప్పేట్లులేదు. ఇక్కడ డబుల్ లోడంటే అర్థం అభ్యర్ధులకు ప్రచారం చేసి గెలిపించుకోవటమే. జనసేనతో పొత్తుంటుందన్న విషయం ఇప్పుడు అధికారికమైంది. రణస్థ‌లం బహిరంగసభలో టీడీపీతో పొత్తుంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు కాబట్టి పొత్తు కన్ఫార్మ్ అయ్యింది. చంద్రబాబు ఎన్ని నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తారు..? ఏవేవి ఇస్తారనే విషయాలు మెల్లిగా బయటకు వస్తాయి.

ఇక్కడ సమస్య ఏమిటంటే.. ఎన్ని నియోజకవర్గాలు ఇచ్చినా ఏ నియోజకవర్గాలు ఇచ్చినా ప్రచార బాధ్యతలు, గెలుపు వ్యూహాలు అయితే ప్రధానంగా చంద్రబాబే మోయాల్సుంటుంది. ఎన్నికల సమయంలో షూటింగులను పక్కనపెట్టేసి పవన్ సుడిగాలి పర్యటనలు చేయాల్సుంటుంది. ఈ పర్యటనల్లో పలానా నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టిపెట్టడానికి పవన్ కు అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకనే ప్రతి నియోజకవర్గం బాధ్యతను చంద్రబాబే మోయకతప్పదు.

ఈ నేపథ్యంలోనే ఒకవైపు తమ్ముళ్ళు పోటీచేస్తున్న నియోజకవర్గాలను చూసుకోవాలి అలాగే మరోవైపు జనసేన అభ్యర్థుల నియోజకవర్గాలను గమనిస్తుండాలి. పొత్తులో టీడీపీ, జనసేన కాకుండా వామపక్షాలు, కాంగ్రెస్ కూడా చేరితే చంద్రబాబుకు భారం మరింత పెరగటం ఖాయం. జనసేనకు నియోజకవర్గాలనే కాదు అభ్యర్ధులను, ఆర్ధికవనరులను కూడా చంద్రబాబే సర్దుబాటు చేయాలని జనాల్లో బాగా చర్చ జరుగుతోంది. ఒకరకంగా ఇది నిజమే అనిపిస్తోంది.

ఇలాంటప్పుడు భారం మోయలేనిదైపోతే అప్పుడు చంద్రబాబు చాలా కష్టపడాల్సొస్తుంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే.. కుప్పంలో తాను గెలవటంతో పాటు పవన్ కల్యాణ్ ను గెలిపించుకోవటం చాలా కీలకమైనది. ఎక్కడినుండి పోటీచేసేది పవన్ ఇంకా ప్రకటించలేదు. ఎక్కడినుండి పోటీచేసినా రెండుపార్టీల మధ్య ఓట్ల బదిలీ అన్నది పక్కాగా జరగకపోతే ముందు నష్టపోయేది పవనే అన్నది ఖాయం. కుప్పంలో చంద్రబాబునే ఓడించాలని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నప్పుడు పవన్ను గెలిపించే విషయంలో చంద్రబాబు ఏమాత్రం దృష్టిపెడతారో చూడాల్సిందే. సో, ఇన్నిరకాలుగా చూసుకున్నప్పుడు వచ్చేఎన్నికల్లో చంద్రబాబు మీద డబుల్ లోడ్ తప్పదనే అనిపిస్తోంది.

First Published:  16 Jan 2023 11:28 AM IST
Next Story