Telugu Global
Andhra Pradesh

సుప్రీంకోర్టుకు వెళ్లొద్దు.. చంద్రబాబుకు కీలక వ్యక్తుల సలహా! దాని వెనుక కారణమేంటి?

ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో శనివారం సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధపడుతున్నారు.

సుప్రీంకోర్టుకు వెళ్లొద్దు.. చంద్రబాబుకు కీలక వ్యక్తుల సలహా! దాని వెనుక కారణమేంటి?
X

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా సీఐడీ పేర్కొన్న చంద్రబాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీఐడీ తనపై ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్టును కొట్టి వేయాలంటూ ఏపీ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. మరోవైపు ఏసీబీ కోర్టు రెండు రోజుల సీఐడీ కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది. ఇది టీడీపీ నాయకులను, మద్దతుదారులను, అభిమానులను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది.

ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో శనివారం సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధపడుతున్నారు. కాగా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారు మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని సలహా ఇచ్చినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వారే అయినా.. చంద్రబాబుకు సదరు వ్యక్తులు మొదటి నుంచి అత్యంత సన్నిహితులు. రాజ్యాంగబద్దమైన కీలక పదవిలో పని చేసిన ఓ వ్యక్తి, న్యాయ వ్యవస్థలో కీలక పదవి చేపట్టి ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్న మరో వ్యక్తితో పాటు.. బాబు సామాజిక వర్గానికి చెంది.. పలు కీలక పదవుల్లో ఉన్న వారు ఈ సలహా ఇచ్చినట్లు సమాచారం.

చంద్రబాబుపై ఇప్పటికే పలు కేసులు నమోదై కోర్టుల వరకు వెళ్లినా.. ఆయన స్టేలు తెచ్చుకొని హాయిగా బయట తిరుగుతున్నారు. ఏపీ సీఐడీ కేసు కూడా ఇలాగే విజయవాడ ఏసీబీ కోర్టులోనే ముగిసిపోతుందని టీడీపీ నాయకులు, అభిమానులు భావించారు. ఏకంగా సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రాను రప్పించడంతో.. బాబు సాయంత్రాని కల్లా బయటకు వచ్చేస్తారని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందో.. అప్పుడే టీడీపీ శ్రేణులకు పెద్ద షాక్ తగిలింది. రాజకీయాల్లో అవినీతి మచ్చ లేని వ్యక్తిని.. తాను నిప్పు అని చెప్పుకునే బాబు.. తొలి సారి ఒక అవినీతి కేసులో రిమాండ్‌కు వెళ్లడంతో టీడీపీ శ్రేణులే కాకుండా.. బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వర్గం ఆందోళన చెందింది.

ఏపీ హైకోర్టులో అయినా బాబుకు ఊరట దక్కుతుందని భావించినా.. క్వాష్ పిటిషన్ తిరస్కరణతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో బాబు పాత్ర నిజమేనేమో అనే అనుమానాలు టీడీపీ, బాబు అభిమానుల్లో కూడా క్రమంగా బలపడుతున్నాయి. ఏకంగా హైకోర్టు కూడా ఈ స్కాంలో లోతైన విచారణ జరగాల్సి ఉందని, ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమని చెప్పేయడంతో టీడీపీ వర్గాలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాయి.

ఏసీబీ కోర్టు రిమాండ్ విధించినప్పుడు.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు.. సోషల్ మీడియాలో సదరు కోర్టు జడ్జిపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా న్యాయ వ్యవస్థనే ప్రశ్నిస్తూ పోస్టుల పెట్టారు. టీడీపీ నాయకులు కూడా బహిరంగంగా కోర్టుపై వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొన్నది. సుప్రీంకోర్టుకు వెళ్తే.. టీడీపీ అభిమానులు న్యాయవ్యవస్థ తీరుపై చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ లాయర్లు ఉదహరించే అవకాశం కూడా ఉన్నది.

ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బాబు తరుపు న్యాయవాదులు సిద్ధపడుతుండగా.. చంద్రబాబు సన్నిహితులు మాత్రం వద్దని వారిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, న్యాయ వ్యవస్థ గురించి పూర్తిగా తెలిసిన మరో వ్యక్తి చంద్రబాబు కుటుంబానికి ఈ సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీం దగ్గరకు వెళ్తే.. ఏపీ ప్రభుత్వ లాయర్లు హైకోర్టులో చెప్పిన కారణాలే అక్కడ కూడా చెప్తారు. పైగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులనే ఉదహరిస్తారు. దీంతో కోర్టు కనీసం పిటిషన్‌ను స్వీకరించకుండానే కొట్టేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మొదటికే మోసం జరుగుతుందని సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది.

ఒక్కసారి సుప్రీం కోర్టులో బాబు పిటిషన్ తిరస్కరణకు గురైతే.. ఇన్నాళ్లూ బాబు పెంచుకున్న ఇమేజీ పూర్తిగా డ్యామేజ్ అవుతుందని సలహా ఇచ్చారు. ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతుంది. సుప్రీంలో కనుక ఫెయిల్ అయితే.. చంద్రబాబు బాగోతం వేరే రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పారట. అత్యున్నత న్యాయస్థానంలో కనుక బాబు ఫెయిల్ అయితే.. దేశ విదేశాల్లో ఉన్న చంద్రబాబు అభిమానులు దూరం అవడం ఖాయమని హెచ్చరించినట్లు తెలుస్తున్నది.

చంద్రబాబు బయటకు రావాలని, అరెస్టును రద్దు చేయాలని ఇప్పటికే ఐటీ నిపుణులు, ఎన్ఆర్ఐలు కొన్ని చోట్ల ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాయి. హైకోర్టు తీర్పు తర్వాత వీరిలో చాలా మంది డీలా పడ్డారు. ఇక నిరసనలు అవసరమా అనే స్థితికి చేరుకున్నారు. సుప్రీంకోర్టులో కూడా బాబుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. ఇక బాబుకు మద్దతు ఇచ్చే వర్గమే లేకుండా పోతుందని అంచనా వేస్తున్నారు.

ఐటీకి ఆద్యుడు, సెల్‌ఫోన్ తెచ్చింది నేనే, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే అంటూ తనను తానే హెచ్చించుకున్న చంద్రబాబుకు వంత పాడే మేధావులు, ఎన్ఆర్ఐలు, రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇతర ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. వీళ్లంతా ఇప్పటికే చాలా వరకు సైలెంట్ అయ్యారు. ఒకరో ఇద్దరూ అప్పుడప్పుడు గళం విప్పుతున్నారు. అదే సుప్రీంకోర్టులో విఫలం అయితే ఒక్కరు కూడా బాబు వెంట ఉండరని.. అప్పుడు తాము కూడా ఏమీ చేసే పరిస్థితి ఉండదని ఆ కీలక వ్యక్తులు సూచించినట్లు తెలుస్తున్నది.

చంద్రబాబు సుప్రీంకు వెళ్తే ఏమవుతుందో వారి కుటుంబ సభ్యుల ద్వారా చంద్రబాబుకు చెప్పించినా.. ఇంత వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు చంద్రబాబు లాయర్లు మాత్రం సుప్రీం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. కాగా, చంద్రబాబు ఈ రోజు నుంచి సీఐడీ కస్టడీలో విచారణను ఎదుర్కోనున్నారు.

First Published:  23 Sept 2023 10:04 AM IST
Next Story