వైసీపీ సాధికార యాత్రలో జగన్ పైనే పంచ్ లు
అడగకుండానే తనకు ఇన్ చార్జ్ పదవి ఇచ్చి, ఆ తర్వాత దాన్ని తీసేయడం ఎందుకంటున్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. అయితే ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన వైసీపీ సాధికార బస్సు యాత్రని ఎంచుకోవడం విశేషం.
వైసీపీ నేతలు చేపట్టిన సాధికార బస్సు యాత్రలో సీఎం జగన్ ని కొంతమంది ఆకాశానికెత్తేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు నేతలు అధినేతపైనే జోకులు పేలుస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి కొలుసు పార్థసారథి బహిరంగ వేదికపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు సీఎం జగన్ తనను పట్టించుకోవట్లేదన్నారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి తనకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇప్పించండి అంటూ పార్టీలోని పెద్ద నేతలకు ఆయన బహిరంగ వేదికపైనుంచి మొరపెట్టుకున్నారు. అంటే తనకు ఆయన అపాయింట్ మెంట్ కూడా దొరకట్లేదని పరోక్షంగా గుర్తు చేశారు డొక్కా.
డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తర్వాత ఆయనకు మంచి ప్రాధాన్యత దక్కిందనే చెప్పాలి. ఓ దశలో తాడికొండ నియోజకవర్గానికి ఆయన్ను ఇన్ చార్జ్ గా ప్రకటించారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే తీసేశారు. ఆ తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు జరిగాయి. చివరికి ఆ స్థానం మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితకు ఖాయం చేశారు. దీంతో డొక్కా ఇబ్బంది పడ్డారు. అడగకుండానే తనకు ఇన్ చార్జ్ పదవి ఇచ్చి, ఆ తర్వాత దాన్ని తీసేయడం ఎందుకంటున్నారు. అయితే ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన వైసీపీ సాధికార బస్సు యాత్రని ఎంచుకోవడం విశేషం. తనకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇప్పించండి అంటూ ఆయన బహిరంగ వేదికపై వేడుకోవడం చూస్తుంటే వైసీపీ అంతర్గత రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.
వైసీపీ సాధికార బస్సు యాత్ర. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలకు చేసిన సామాజిక న్యాయాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేసేందుకు చేపట్టిన యాత్ర ఇది. దీనిపై ఎల్లో మీడియా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కనీసం ఈ యాత్ర ఎక్కడుంది, ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే దానిపై వారికి ఆసక్తి లేదు. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, జనం రావట్లేదు అనే కామన్ స్టేట్ మెంట్ అక్కడ కనపడుతుంది. ఇటు వైసీపీ అనుకూల మీడియా కూడా కేవలం జగన్ పై వస్తున్న పొగడ్తల్ని మాత్రమే హైలైట్ చేస్తోంది. కానీ సాధికార యాత్రలో మరో కోణం కూడా ఉంది. సాక్షాత్తూ సీఎం జగన్ పైనే పంచ్ లు పడుతున్నాయి. మొన్న కొలుసు పార్థసారథి బయటపడ్డారు, నిన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఇలాంటి సీనియర్లంతా వైసీపీలో తమకు అవమానాలు ఎదురయ్యాయంటూ సాధికార యాత్రలోనే పరోక్ష వ్యాఖ్యలు చేయడం విశేషం.