పవన్ అంత ధైర్యం చేస్తారా..?
కాకినాడ సిటీ నియోజకవర్గంపై పవన్ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపించారు. డివిజన్ల వారీగా ఉన్న సామాజికవర్గాల ఓట్లు, కీలకమైన నేతల గురించి విచారించారట. వైసీపీతో పాటు వివిధ పార్టీల బలాబలాల గురించి వాకాబు చేశారట.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంతర్యం ఏమిటో అర్థంకావటం లేదు. కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలతో పాటు కోనసీమ జిల్లాలోని అన్నీ నియోజకవర్గాలపైన పవన్ సమీక్షించారు. అభ్యర్థులను ఎంపికచేసే ఉద్దేశ్యంలోనే పవన్ సమీక్షలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. పార్టీలో గట్టి అభ్యర్థులు లేరనుకున్నప్పుడు వ్యాపార, పారిశ్రామికరంగాలకు చెందిన ప్రముఖులకు టికెట్ ఆఫర్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. అందుకనే నియోజకవర్గాల్లో సామాజికవర్గాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ సమీక్షల్లోనే ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది.
అదేమిటంటే.. కాకినాడ సిటీ నియోజకవర్గంపై పవన్ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపించారు. డివిజన్ల వారీగా ఉన్న సామాజికవర్గాల ఓట్లు, కీలకమైన నేతల గురించి విచారించారట. వైసీపీతో పాటు వివిధ పార్టీల బలాబలాల గురించి వాకాబు చేశారట. వైసీపీ బలమెంత..? జనసేన+టీడీపీ బలంపైన కూడా ఆరాలు తీసినట్లు సమాచారం. కాకినాడ సిటీ నియోజకవర్గంపై చూపించిన శ్రద్ధ కారణంగా ఇక్కడ పవన్ పోటీచేయాలని అనుకుంటున్నారా.. అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అంటే పవన్‌కు ఎంతమంటుందో అందరికీ తెలిసిందే.
దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో కాకినాడలో పోటీచేసి తనను ఓడించాలని ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు. వారాహి యాత్ర సందర్భంగా పవన్-ద్వారంపూడి ఒకరిని మరొకరు నోటికొచ్చినట్లు తిట్టేసుకున్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే ఛాలెంజ్‌కు పవన్ ఏమీ స్పందించలేదు. అయితే తాజా పరిణామాల్లో టీడీపీ+జనసేన కలిస్తే ద్వారంపూడిని కచ్చితంగా ఓడించవచ్చనే ధైర్యం పవన్ కు వచ్చినట్లుంది. అందుకే వైసీపీ బలంతో పాటు టీడీపీ, జనసేన బలం గురించి వాకాబుచేసింది. అయితే ద్వారంపూడికి క్షేత్రస్థాయిలో చాలా పట్టున్న సంగతి అందరికీ తెలిసిందే. రెడ్డి సామాజికవర్గంతో పాటు ఇతర సామాజికవర్గాల్లో కూడా ఎమ్మెల్యేకి గట్టి పట్టుంది.
ఒకవేళ పవన్ ధైర్యంచేసి కాకినాడ సిటీలో పోటీచేస్తే అందరి కళ్ళు ఈ నియోజకవర్గం మీదే ఉండటం గ్యారంటీ. పోటీ కారణంగా మంటలు పుట్టే కొద్ది నియోజకవర్గాల్లో కాకినాడ సిటీ కూడా ఒకటవుతుంది. టీడీపీ మద్దతుతో పవన్, రెడ్డి, బీసీ, ఎస్సీ, మైనారిటీల మద్దతుతో ద్వారంపూడి గెలుపునకు తీవ్రంగా శ్రమించాల్సుంటుంది. చివరకు విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.