జగన్‌కు కావాల్సిందిదేనా?
ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చైర్మన్ పదవిలో ఉంటూనే మళ్ళీ టికెట్ కోసం యార్లగడ్డ గోల మొదలుపెట్టారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకోనని బెదిరిస్తున్నారు. పార్టీ మారైనా సరే తాను పోటీలో ఉండటం ఖాయమని వార్నింగులిస్తున్నారు.
రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒకటే మందు అన్న సామెత తెలుగులో చాలా పాపులర్. ఇప్పుడు ఇది ఎందుకంటే గన్నవరం రాజకీయాలు చాలా హాటుహాటుగా ఉన్నాయి. తనకు టికెట్ ఇవ్వకపోతే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతాననే పరోక్ష బెదిరింపులతో కూడిన సంకేతాలను యార్లగడ్డ వెంకటరావు పంపుతున్నారు. మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ రెండు మూడు రోజులుగా యార్లగడ్డ చాలా హడావుడి చేస్తున్నారు. ఇదే సమయంలో యార్లగడ్డ పార్టీని వదిలేయటమే కావాల్సిందన్నట్లుగా పార్టీ వ్యవహరిస్తోంది.
అంటే జగన్ అనుకుంటున్నది, యార్లగడ్డ చెబుతున్నది ఒకటే. జగన్ వల్ల తనకు అన్యాయం జరిగిందని యార్లగడ్డ చెబుతున్నది తప్పు. ఎందుకంటే 2014లో గన్నవరంలో వైసీపీ నుండి దుట్టా రామచంద్రరావు పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మళ్ళీ దుట్టాకే టికెట్ ప్రకటిస్తారు అని అనుకుంటున్న సమయంలో సడెన్‌గా అమెరికా నుండి యార్లగడ్డ వచ్చి వైసీపీలో చేరి టికెట్ తీసుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత మారిన పరిణామాల్లో జగన్‌కు వంశీ దగ్గరయ్యారు. దాంతో రాబోయే ఎన్నికల్లో వంశీయే వైసీపీ తరపున పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. అప్పటి నుండి వంశీ-యార్లగడ్డ-దుట్టా వర్గాలకు పడటంలేదు. చివరకు వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ, దుట్టాలు ఏకమయ్యారు. వంశీ-యార్లగడ్డ మధ్య చాలాకాలంగా పంచాయితీ నడుస్తోంది. పంచాయితీకి పరిష్కారంగా జగన్ సూచించినట్లు కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ పోస్టును యార్లగడ్డ తీసుకున్నారు. కాబట్టి పార్టీలో యార్లగడ్డ సమస్య పరిష్కారమైనట్లే.
అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చైర్మన్ పదవిలో ఉంటూనే మళ్ళీ టికెట్ కోసం యార్లగడ్డ గోల మొదలుపెట్టారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకోనని బెదిరిస్తున్నారు. పార్టీ మారైనా సరే తాను పోటీలో ఉండటం ఖాయమని వార్నింగులిస్తున్నారు. అయితే ఇలాంటి వార్నింగులను జగన్ పట్టించుకోరన్న విషయం యార్లగడ్డకు ఇంకా అర్థంకాలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో ఉండదలచుకున్నవాళ్ళు ఉంటారు వెళ్ళదలచుకున్నవాళ్ళు వెళ్ళిపోతారన్నారు. అంటే యార్లగడ్డ పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోవటమే జగన్ కూడా కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది.