Telugu Global
Andhra Pradesh

కేంద్రంతో ఆ హామీ ఇప్పించే ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా..?

ఏదో విధంగా మసిపూసి మారేడు కాయ చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో స్థానిక నాయకుల చేత హామీ ఇప్పించారని అంటున్నారు.

కేంద్రంతో ఆ హామీ ఇప్పించే ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా..?
X

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఎజెండాగా మారింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ బీజేపీ ఢిల్లీ పెద్దలు గానీ ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్తున్నారు. కానీ, కీలకమైన అంశాల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. అటువంటి కీలకమైన అంశాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఒక్కటి.

అయితే, టీడీపీ కూటమి విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయనీయమని విశాఖలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తీర్మానం చేసింది. విశాఖ పార్లమెంటు పరిధిలో మూడు పార్టీలు కలసి ఆ తీర్మానం చేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని కూటమి స్థానిక నేతలు చెబుతున్నారు.

గత మూడేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం నలుగుతోంది. విశాఖలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో దాని ప్రభావం ఉంటుంది. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ గానీ, బీజేపీ పెద్దలు గానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయబోమని హామీ ఇవ్వడం లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో చిలకలూరిపేట సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేత చంద్రబాబు హామీ ఇప్పించలేకపోయారని కార్మికులు మండిపడుతున్నారు.

ఈ స్థితిలో ఏదో విధంగా మసిపూసి మారేడు కాయ చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో స్థానిక నాయకుల చేత హామీ ఇప్పించారని అంటున్నారు. కూటమిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని పోరాటం చేస్తామని స్థానిక నాయకులు హామీ ఇచ్చారు. ఇదో తంతు మాత్రమేనని అంటున్నారు.

స్థానిక నాయకులు పోరాడితే కేంద్రం దిగివచ్చే అవకాశం లేదని, స్థానిక పోరాటాల వల్ల సమస్య పరిష్కారం కాదని అందరికీ తెలుసు. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. అందుకు టీడీపీ నాయకత్వం వహించాలి. అది స్టీల్ ప్లాంట్ కార్మికులకు స్పష్టంగా తెలుసు. అందువల్ల స్థానిక నాయకుల హామీని స్టీల్ ప్లాంట్ కార్మికులు నమ్మే అవకాశం లేదు. ఈ విషయంలో చంద్రబాబు పప్పులేమీ ఉడకవు.

First Published:  6 April 2024 7:37 PM IST
Next Story