స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయబోమని కేంద్రం చెప్పిందా బాబూ..?
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. అటువంటప్పుడు ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయబోమనే హామీని ఎందుకు బీజేపీ నుంచి పొందలేకపోయారు?
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జోక్ లు బాగానే వేస్తారు. తాము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం ప్రజాగళం సభలో ఆయన ఆ హామీ ఇచ్చారు. ఏ ఎండకా గొడుగు పట్టడం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పొత్తు కోసం ఆయన బీజేపీ పెద్దల వద్ద సాగిలబడ్డారు. కానీ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ నుంచి ఒక్క హామీని కూడా పొందలేదు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. అటువంటప్పుడు ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయబోమనే హామీని ఎందుకు బీజేపీ నుంచి పొందలేకపోయారు? ఇప్పుడు బూటకపు హామీతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను, విశాఖ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళన చేద్దామంటే వైఎస్ జగన్ కలిసి రాలేదని నిందలు వేశారు. ఇతరులను తప్పు పట్టడం తప్ప చంద్రబాబుకు మరోటి తెలియదు.
తన భాగస్వామ్య పార్టీలతో కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతానని ఆయన అంటున్నారు. ఆయనకు అంత దమ్మే ఉంటే బీజేపీతో పొత్తు పెట్టుకునే ముందే అందుకు సంబంధించిన హామీని పొందాల్సి ఉండింది. హామీలు ఇచ్చి అధికారం దక్కిన తర్వాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూస్తానంటే ఆయనను నమ్మేదెవరు?
జగన్ ప్రభుత్వంపై ఆయన మరో నింద వేశారు. విశాఖను రాజధానిగా చేస్తానని వైఎస్ జగన్ విశాఖను డ్రగ్ ట్రేడింగ్ హబ్ గా మార్చారని ఆయన విమర్శించారు. డ్రగ్స్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటుండడం వల్లనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయనే విషయాన్ని ఆయన గ్రహించలేక ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. తనకన్నా తెలివి గలవాళ్లు లేరని చంద్రబాబు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రజలు చంద్రబాబు కన్నా ఎక్కువ తెలివిగలవాళ్లు.