Telugu Global
Andhra Pradesh

మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌..

అని అనగలరా చంద్రబాబు..? అంత నిజాయితీ ఉందా అసలు..? గుండె దిటవు చేసుకుని ఆ మాట అనవలసిన సమయం కదా ఇది.

మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌..
X

జగన్మోహన్‌రెడ్డిని ఓడించాలని పంతం పట్టిన బాబు, పవన్‌కల్యాణే మా తురుఫుముక్క అని అనాలిగా..! జగన్ని నూటికి నూరుశాతమూ ఓడించాలంటే కాపు ఓటు తప్పనిసరి అని చంద్రబాబుకి తెలుసు. అందుకోసమేగా పవన్‌ని పట్టుకువేలాడుతున్నది..! ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పవన్‌ ప్రాధాన్యం తెలిసినందువల్లే కదా, ప్రధాని నరేంద్రమోడీ పవన్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నది..! ‘‘పవనే మా సీఎం’’ అంటే అటు కాపులూ ఒక్కటౌతారు. ఇటు మోడీ కూడా ఆనందంగా మద్దతు ఇస్తారు. ఈ మాత్రం తెలీదా చంద్రబాబుకి..!

ఎందుకు తెలీదూ. తెలీక కాదు, అధికారం బాబుకి ఒక మానసిక అవసరం. అది లేకుండా బతకలేడు. వందల వేల కోట్లు ఇచ్చిన అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేడు. అతనికి కాపుల పట్ల ప్రేమా లేదు. సానుకూల దృక్పథమూలేదు. అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలన్న దుగ్ధ తప్ప, మరో ఆలోచనే లేదు.

స్వార్థానికి ప్యాంట్‌ తొడిగి, సిగ్గుమాలిన తనానికి షర్ట్‌ వేస్తే అదే చంద్రబాబునాయుడు. కాపు నాయకులు దానికే భయపడుతున్నారు. పవన్‌ కల్యాణ్‌కి సొంత ఇమేజి ఉంది. సైనికుల్లాంటి కార్యకర్తలూ, అభిమానులూ ఉన్నారు. రాష్ట్రమంతా వ్యాపించి ఉన్న సొంత కులం బలగం ఉంది. మనం వెళ్లి బాబు పంచన చేరడంలో విజ్ఞత ఏమిటి..? భస్మాసురుడి దగ్గరకి వెళ్లి బిచ్చం అడిగితే అతను నెత్తి మీద చెయ్యిపెట్టక ఏం చేస్తాడు..? అయిదు శాతం కూడా లేని (అమెరికాలోనే ఎక్కువ మంది ఉండడం వల్ల) కమ్మవారిని నమ్ముకొని ఇరవై శాతానికంటే ఎక్కువ ఉన్న కాపుల్ని బలిపెట్టడంలోని ఔచిత్యం ఏమిటి..? చంద్రబాబు రాజకీయ చదరంగంలో కాపులు ఎందుకు పావులు కావాలి..?

పోనీ పవన్‌ మన సీఎం అని ప్రకటించమనండి, అప్పుడు తెలుగుదేశంతో కలవడానికో అర్థం ఉంటుంది. ముఖ్యమంత్రి పదవితో సహా సింహభాగం చంద్రబాబు మింగేసి, చిల్లర మాత్రం కాపుల మొహాన విసిరికొట్టే ఎత్తుగడలకి తెలిసి తెలిసీ మనమెందుకు మోసపోవాలి..? అని కాపు పెద్దలు సతమతం అవుతున్నారు. ఈ రకంగా మెజారిటీ కాపులకీ, శక్తిమంతుడైన దేశ ప్రధానికీ నచ్చని పనిని పవన్‌ ఎందుకు చేస్తున్నట్టు..?

వయసు 73 ఏళ్లు దాటిపోతున్నా, అధికార దాహంతో ఊగిపోతున్న బాబు మనకెలా నాయకుడవుతాడు..? రాజకీయాలంటే వ్యూహమూ, ఎత్తుగడలూ కదా.. మరి ఇదేం వ్యూహం..? ఇదేం లొంగుబాటు..? ఎవరి ప్రయోజనాల కోసం ఈ త్యాగం..? కాపుజాతి ఆశల్ని, ఆకాంక్షల్ని ఎంతకి అమ్మేసినట్టు..? ఎన్నికోట్లు కుమ్మేసినట్టు..? అని కాపు యువత నిరాశతో వేదనతో అడుగుతోంది. ఈ ప్రశ్నకి జవాబు ఎవరు చెబుతారు..?

First Published:  2 Feb 2024 3:10 PM IST
Next Story