Telugu Global
Andhra Pradesh

తెలంగాణతో పాటే ఎన్నికలకు వెళ్లడానికి ఏపీ సీఎం జగన్ వ్యూహం?

ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నది.

తెలంగాణతో పాటే ఎన్నికలకు వెళ్లడానికి ఏపీ సీఎం జగన్ వ్యూహం?
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధ పడుతున్నారా? తెలంగాణతో పాటే ఏపీకి ఎన్నికలు జరిగేలా వ్యూహం రచిస్తున్నారా? అంటే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని, షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, సీఎం జగన్ మాత్రం ఆరు నెలలు ముందుగా ఏపీలో ఎన్నికలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణకు ఎప్పుడు ఎన్నికలు జరిగితే.. అప్పుడు ఏపీకి కూడా ఎలక్షన్స్ వచ్చేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలు జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే, బీజేపీ-జనసేనతో పొత్తులు ఉంటాయని చెబుతున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో అయితే మోడీ ప్రభుత్వ ప్రభావం ఏపీలో ఉంటుందని జగన్ భావిస్తున్నారు. అది వైసీపీకి కాస్త నష్టం చేకూర్చ వచ్చని అంచనా వేస్తున్నారు. అదే తెలంగాణతో పాటే ఎన్నికలు జరిగితే.. మోడీ ప్రభావం ఉండబోదని.. పైగా బీజేపీ తెలంగాణపైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో ఈ సారి పోటీ చేస్తానని ప్రకటన చేశారు. ఒకే సారి రెండు రాష్ట్రాల్లో జనసేన దృష్టి పెట్టడం వైసీపీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం. మరోవైపు జనసేన, టీడీపీ ఈ సారి తెలంగాణలో పోటీ చేయాలని భావిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ కేవలం ఏపీ మీద మాత్రమే ఫోకస్ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలు వస్తే అది వైసీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల పార్టీ నేతలకు కూడా ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నది, నిర్లక్ష్యంగా ఉండొద్దని సీఎం జగన్ సూచిస్తున్నారు. జగన్ మాటలు చూస్తుంటే ఏడాదిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ముందుగానే అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే టీడీపీ మినహా మిగతా రెండు పార్టీలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. పొత్తులు, చర్చలు, అభ్యర్థుల ఎంపిక మూడు పార్టీలకు కత్తిమీద సామే. ఇక ఒంటరిగా పోటీ చేసే వైసీపీకి అలాంటి ఆటంకాలు ఏవీ ఉండవు. టికెట్ల విషయంలో ఇప్పటికే వైఎస్ జగన్ ఒక స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ సీట్లు కేటాయిస్తారు. ఇక పని తీరు బాగాలేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోనని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇటీవల పీకే సర్వే టీం కూడా విస్తృతంగా సర్వే చేస్తు రిపోర్టులు ఇస్తోంది. దీంతో టికెట్ల విషయంలో వైఎస్ జగన్‌కు పెద్దగా ఆటంకాలు ఉండబోవని అంటున్నారు. ఇది జగన్‌కు కలిసొచ్చే అంశమే.

ఎన్నికల కోసం జగన్ ఇప్పటి నుంచే పూర్తి సన్నద్ధం అవుతున్నట్లు కనపడుతున్నది. పలు అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. ఏడాది లోపు పనులు పూర్తి కావాలని అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అంతే కాకుండా కీలకమైన స్థానాల్లో తనకు అనుకూలమైన అధికారులను నియమించుకుంటున్నారు. సాధారణంగా ఎన్నికల ముందు అధికారులను బదిలీ చేస్తుంటారు. కానీ జగన్ ముందుగానే ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఒక ప్లేస్‌లో పని చేస్తుంటే ఈసీఐ వారిని బదిలీ చేస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా ఏడాది ముందు వైఎస్ జగన్ బదిలీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా పోలీసు అధికారుల బదిలీల విషయంలో సీఎం జగన్ ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నట్లు కనపడుతోంది.

ఏపీ అసెంబ్లీని ఆరు నెలల ముందుగా రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలంటే అందుకు కేంద్రం ఒప్పుకుంటుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీపై బీజేపీ పెద్దగా ఫోకస్ చేయడం లేదు. ఒక్కడ ఓడిపోయినా పెద్దగా వచ్చే నష్టం లేదు. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగితే వైసీపీకే లాభం కలుగుతుంది. అందుకే ఒక వేళ సీఎం జగన్ ముందస్తుకు వెళ్లినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం వైఎస్ జగన్‌తో పెద్దగా విభేదాలు లేవు. బీజేపీ పూర్తిగా తెలంగాణపైనే దృష్టి పెట్టింది. కాబట్టి జగన్ నిర్ణయానికి సానుకూలంగానే కేంద్రం స్పందించే అవకాశం ఉన్నది.

First Published:  19 Nov 2022 10:03 AM IST
Next Story