Telugu Global
Andhra Pradesh

బీసీలు ఎటువైపో తేలిపోతుందా..?

బీసీలంతా తమవైపే ఉన్నారని, ఉంటారని వైసీపీ ధీమా వ్యక్తంచేస్తోంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు జయహో బీసీ సదస్సు నిర్వహిస్తోంది. పంచాయతీ నుంచి మంత్రి పదవుల వరకు పదవులు పొందిన బీసీ ప్రతినిధులు సుమారు 82 వేలమందితో సదస్సు నిర్వహిస్తున్నారు.

బీసీలు ఎటువైపో తేలిపోతుందా..?
X

విజయవాడలో బుధవారం జరుగుతున్న జయహో బీసీ సదస్సులో బీసీల మొగ్గు ఎటువైపో తేలిపోతుందా..? అవుననే అంటున్నారు అధికార వైసీపీ నేతలు. నిజానికి బీసీలంతా తమవైపే ఉన్నారని వైసీపీ నేతలంటున్నారు. కానీ అదిపూర్తిగా వాస్తవంకాదు. బీసీల్లో మెజారిటీ సెక్షన్లు మాత్రమే అధికార పార్టీతో ఉన్నాయి. ఇంకా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న బీసీ సామాజికవర్గాలున్నాయి. వాటిని కూడా తమవైపు లాక్కోవాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన.

ఇందులో భాగంగానే జయహో బీసీ సదస్సు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో తాను అధికారంలోకి వస్తే బీసీలకు ఏమి చేయబోతున్నారనే విషయంలో జగన్ కొన్ని హామీలిచ్చారు. దాంతో జగన్ మాటలను నమ్మిన బీసీలు తర్వాత జరిగిన ఎన్నికల్లో మద్దతిచ్చారు. దానికి తగ్గట్లే బీసీలకు అన్నింటిలోను జగన్ పెద్దపీట‌ వేస్తున్నారు. మంత్రి పదవులు, ఎంఎల్సీ, ఎంఎల్ఏ, ఎంపీలు పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి అన్నింటిలోనూ న్యాయబద్ధంగా దక్కాల్సిన దానికన్నా జగన్ ఎక్కువే ఇస్తున్నారు.

దీంతోనే బీసీలంతా తమవైపే ఉన్నారని, ఉంటారని వైసీపీ ధీమా వ్యక్తంచేస్తోంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు జయహో బీసీ సదస్సు నిర్వహిస్తోంది. పంచాయతీ నుంచి మంత్రి పదవుల వరకు పదవులు పొందిన బీసీ ప్రతినిధులు సుమారు 82 వేలమందితో సదస్సు నిర్వహిస్తున్నారు. అచ్చంగా బీసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించటం గతంలో ఎప్పుడూ జరగలేదేమో. ఈ సదస్సు సందర్భంగా జగన్ ఇవ్వబోయే హామీలతో ఇతర పార్టీలకు మద్దతిస్తున్న బీసీలను కూడా ఆకర్షించాలన్నది జగన్ టార్గెట్.

ఈ సదస్సు తర్వాత జగన్ ఆలోచన కార్యరూపంలోకి వస్తుందని పార్టీనేతలు నమ్ముతున్నారు. దీంతోనే బీసీల మొగ్గు ఎటువైపు, వచ్చే ఎన్నికల్లో బీసీల మద్దతు ఏ పార్టీకి అనేది తేలిపోతుందనే అనుకుంటున్నారు. నిజంగానే జగన్ ఆలోచిస్తున్నట్లుగా బీసీలంతా వైసీపీకే మద్దతుగా నిలబడితే ప్రత్యర్ధి పార్టీలు విడివిడిగా పోటీచేసినా పొత్తులు పెట్టుకున్నా ఎలాంటి లాభం ఉండదనే అనుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం ఓట్లలో బీసీలే 50 శాతంకుపైగా ఉన్నారు కాబట్టి.

First Published:  7 Dec 2022 11:18 AM IST
Next Story