Telugu Global
Andhra Pradesh

బీజేపీ పెద్దల దగ్గర పూర్తి రిపోర్టుందా?

జీఎస్టీ, ఐటీ, ఈడీలు చంద్రబాబు పాత్రపై రిపోర్టును కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు అందించాయట. ఈ రిపోర్టులు నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గరున్నట్లు సమాచారం. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు అరెస్టుకు సీఐడీ ఫిజికల్‌గా మాత్రమే కారణం.

బీజేపీ పెద్దల దగ్గర పూర్తి రిపోర్టుందా?
X

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబునాయుడు అరెస్టయి రిమాండుకు వెళ్ళినప్పటి నుంచి టీడీపీ నేతలు, చంద్రబాబు మద్దతుదారులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అదేమిటంటే చంద్రబాబు అరెస్టుపై బీజేపీ పెద్దలు ఎందుకు నోరిప్పటంలేదని. టీడీపీ ఉద్దేశంలో చంద్రబాబు అరెస్టు అక్రమం, రిమాండ్‌ అన్యాయమని. ఇదే మాటను నరేంద్ర మోడీ, అమిత్ షాలు చెప్పాలని పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. వీళ్ళెంత డిమాండ్లు చేసినా ఢిల్లీ పెద్దలు అసలు నోరిప్పటంలేదు. కారణం ఏమిటి?

ఏమిటంటే చంద్రబాబు అరెస్టు, రిమాండుకు సంబంధించిన పూర్తి రిపోర్టు మోడీ దగ్గరుందట. ఎలాగంటే అసలు స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుకు కారణమే కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల నివేదికలు. స్కిల్ స్కామ్ అవినీతిపై మొదట దర్యాప్తు చేసింది జీఎస్టీ ఇంటెలిజెన్స్. దీని రిపోర్టు ఆధారంగానే ఐటీ శాఖ రంగంలోకి దిగింది. ఈ రెండు శాఖల దర్యాప్తులో వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని అర్థ‌మైందట. వెంటనే రెండు శాఖల రిపోర్టుతో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ చేసిన దర్యాప్తులోనే రూ.247 కోట్లు విదేశాల్లోని షెల్ కంపెనీల్లోకి చేరిందని బయటపడిందట.

అప్పటికే ఈ కేసులో అరెస్టయిన సుమంత్ బోస్, ఖన్వేల్కర్ తదితరులను తమదైన పద్ధ‌తిలో ఈడీ విచారిస్తే మెజార్టీ షేర్ చంద్రబాబుకే చేరిందని తేలిందట. ఈ విషయంలో చంద్రబాబు పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ కీలకమని తేలింది. ఈడీ ఇచ్చిన సమాచారం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం 2021లో సీఐడీ విచారణకు ఆదేశించింది.

పెండ్యాలను విచారించేందుకు సీఐడీ నోటీసులు జారీచేసింది. అయితే అనారోగ్యం పేరుతో పెండ్యాల అమెరికాకు పారిపోయాడు. ఎప్పుడైతే పెండ్యాల పారిపోయాడో చంద్రబాబు మీద అనుమానాలు పెరిగిపోయాయి. ఇదే సమయంలో చంద్రబాబు పాత్రకు అన్నీ ఆధారాలు సీఐడీకి దొరికాయి. అందుకనే డైరెక్టుగా 409 సెక్షన్ కింద సీఐడీ అరెస్టు చేసింది. జీఎస్టీ, ఐటీ, ఈడీలు చంద్రబాబు పాత్రపై రిపోర్టును కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు అందించాయట. ఈ రిపోర్టులు నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గరున్నట్లు సమాచారం. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు అరెస్టుకు సీఐడీ ఫిజికల్‌గా మాత్రమే కారణం. కానీ అంతకుమించి కేంద్ర దర్యాప్తు సంస్థ‌ల రిపోర్టులు అత్యంత కీలకం. అందుకనే చంద్రబాబు అరెస్టుపైన వాళ్లిద్ద‌రు నోరిప్పంది. చూస్తుంటే కేసు నుంచి చంద్రబాబు బయటపడటం చాలా కష్టమనే అనిపిస్తోంది.


First Published:  21 Sept 2023 10:42 AM IST
Next Story