Telugu Global
Andhra Pradesh

నిజంగా ఏపీలో కాంగ్రెస్‌కు అంత సీనుందా..?

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె వైఎస్ ష‌ర్మిల‌కు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్య‌తలు అప్ప‌గించ‌గానే హ‌ఠాత్తుగా ఆ పార్టీ శ‌క్తివంత‌మైపోయిన‌ట్లు కాంగ్రెస్ నేత‌లు, మీడియాలో ఓ వ‌ర్గం చేస్తున్న హ‌డావుడి చూసి జ‌నం ముక్కున వేలేసుకుంటున్నారు.

నిజంగా ఏపీలో కాంగ్రెస్‌కు అంత సీనుందా..?
X

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ అంప‌శ‌య్య మీద‌కు చేరింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు క‌దా.. హ‌స్తం గుర్తు మీద కౌన్సిల‌ర్‌ను కూడా గెలిపించుకోలేని ద‌య‌నీయస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్‌ది. ఒక‌నాడు ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో దిగ్గ‌జాలుగా పేరొందిన నేత‌లంతా అయితే టీడీపీలో, లేదంటే వైసీపీలోకి జారుకున్నారు. ర‌ఘువీరారెడ్డి, ప‌ళ్లంరాజు, హ‌ర్ష‌కుమార్ లాంటి నేత‌లు ఎటూ వెళ్ల‌లేక కాంగ్రెస్‌లోనే అలా స్త‌బ్దుగా ఉండిపోయారు. గిడుగు రుద్ర‌రాజు పీసీసీ అధ్య‌క్షుడ‌య్యాక ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ల‌తో కాంగ్రెస్ కాస్త వార్త‌ల్లో క‌న‌ప‌డ‌సాగింది. అలాంటిది ఇప్పుడు దివంగ‌త కాంగ్రెస్ నేత‌, ముఖ్య‌మంత్రిగానే తుది శ్వాస విడిచిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె వైఎస్ ష‌ర్మిల‌కు రాష్ట్ర కాంగ్రెస్ బాధ్య‌తలు అప్ప‌గించ‌గానే హ‌ఠాత్తుగా ఆ పార్టీ శ‌క్తివంత‌మైపోయిన‌ట్లు కాంగ్రెస్ నేత‌లు, మీడియాలో ఓ వ‌ర్గం చేస్తున్న హ‌డావుడి చూసి జ‌నం ముక్కున వేలేసుకుంటున్నారు.

విభ‌జ‌న గాయం చేసింది కాంగ్రెస్సే..

రాష్ట్ర విభ‌జ‌న చేసింది కాంగ్రెస్సేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. అందుకే కాంగ్రెస్‌ను నిర్ద్వందంగా తిర‌స్క‌రిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవ‌రున్నా స‌రే ఏపీ జ‌నానికి అన‌వ‌స‌రం. కాంగ్రెస్సే విభ‌జ‌న గాయం చేసింద‌ని న‌మ్ముతున్న జ‌నం హ‌స్తం గుర్తు మీద ఓటేసి గెలిపించ‌డం ఇప్ప‌ట్లో జ‌రిగే ముచ్చ‌ట కాదు.

2014 నుంచి 2019కి స‌గానికి తగ్గిన ఓట్లు

విభ‌జ‌న చేసింది కాంగ్రెస్ పార్టీయేన‌న్న ఆగ్ర‌హంతో 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీని జ‌నం ప‌క్క‌న పెట్టేశారు. ఆ ఎన్నిక‌ల్లో పోలైన మొత్తం ఓట్ల‌లో హ‌స్తం గుర్తుమీద ప‌డిన‌వి జ‌స్ట్ 2.8%. ఆ త‌రువాత 2019 ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారిపోయింది. ఓట్ షేర్ 1.21%కి ప‌డిపోయింది. అంటే స‌రాస‌రిన వంద‌లో ఒక్క‌రు మాత్ర‌మే కాంగ్రెస్‌కు ఓటేశారు. ఈ లెక్క‌న జ‌నంలో కాంగ్రెస్ అంటే ఆగ్ర‌హం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

ష‌ర్మిల వ‌స్తే సీన్ మారిపోతుందా..?

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డ‌గా ష‌ర్మిల‌కు ఉన్న గుర్తింపు త‌మ‌కే మాత్ర‌మైనా ఉప‌యోగ‌ప‌డ‌క‌పోతుందా అనే దింపుడు క‌ళ్లం ఆశ కాంగ్రెస్‌ది. అందుకే పార్టీలో చేర్చుకుని, ఏపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టింది. కానీ, ఇక్క‌డ కాంగ్రెస్ అధిష్టానం మ‌ర్చిపోకూడ‌ని అంశం ఏపీ జ‌నానికి హ‌స్తం గుర్తు మీదే ప‌గ ఉండిపోయింది. అది ష‌ర్మిల కాదు క‌దా అంత‌కు మించి ఎవ‌రొచ్చినా తీరేది కాదు. కాంగ్రెస్ ఇక్క‌డ గెలిచేదీ లేదు. ఇదంతా వార్త‌ల్లో చెప్పుకోవ‌డానికి, పేప‌ర్ల‌లో రాసుకోవ‌డానికి ప‌నికొచ్చే పల్లీ బ‌ఠానీ బాప‌తు మాత్ర‌మే!!!

First Published:  21 Jan 2024 7:21 PM IST
Next Story