Telugu Global
Andhra Pradesh

ట్రస్ట్‌ నిధులు తానాకు మళ్లింపు

నిబంధనల ప్రకారం ఏ ఉద్దేశంతో విరాళాలు వసూలు చేశారో వాటికే ఖర్చు చేయాలి. కానీ, ఇక్కడ కోమటి జయరాం ఆ నిధులను ఇతర కార్యక్రమాలు మళ్లించినట్టు ఆరోపణ.

ట్రస్ట్‌ నిధులు తానాకు మళ్లింపు
X

టీడీపీ అనుబంధ ఎన్‌ఆర్‌ఐలు ట్రస్ట్‌ నిధులను తానా సభకు మళ్లించడంపై దాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ సానుభూతిపరుడు కోమటి జయరాంపై ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా ఏపీ జన్మభూమి పేరిట ఒక స్వచ్చంద సంస్థను అమెరికాలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కోమటి జయరాం అధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోమటి జయరాంను నార్త్ అమెరికాకు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు.

పేద విద్యార్థులకు సాయం, ఏపీలో పేదరిక నిర్మూలన కార్యక్రమాల పేరుతో డబ్బును వసూలు చేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు లక్షలాది డాలర్లు ఎన్‌ఆర్‌ఐల నుంచి వసూలు చేశారు. భారత కరెన్సీలో ఆ మొత్తం కోట్లలో ఉంటుంది.

నిబంధనల ప్రకారం ఏ ఉద్దేశంతో విరాళాలు వసూలు చేశారో వాటికే ఖర్చు చేయాలి. కానీ, ఇక్కడ కోమటి జయరాం ఆ నిధులను ఇతర కార్యక్రమాలు మళ్లించినట్టు ఆరోపణ. ముఖ్యంగా తానా సభల నిర్వాహణకు ఈ నిధులు ఖర్చు చేసినట్టు కొందరు గుర్తించారు. తానా సభల నిర్వాహణకు ఇచ్చిన చెక్‌లను కూడా కొందరు బయటకు తీసుకొచ్చారు. 2022 మే, ఆగస్టు నెలల్లో తానాకు ట్ర‌స్టు నుంచి రెండు చెక్‌లు వెళ్లాయి.

ఏపీ జన్మభూమికి విరాళం ఇచ్చిన రావు కందుల అనే ఎన్‌ఆర్‌ఐ.. పేద విద్యార్థుల కోసం డొనేషన్‌ ఇచ్చానని.. ఆ నిధులను మాత్రం కల్చరల్ యాక్టివిటీస్‌ పేరుతో దారి మళ్లించారని ఆరోపించారు. డబ్బు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను ఇలా దారి మళ్లించడం బాధగా ఉందన్నారు. వసూలైన నిధుల్లో దాదాపు 70 శాతం సొమ్మును ఇతర కార్యక్రమాలకు దారి మళ్లించినట్టు ఎన్‌ఆర్‌ఐలు ఆరోపిస్తున్నారు.

*

First Published:  8 Sept 2023 10:33 AM IST
Next Story