Telugu Global
Andhra Pradesh

కొట్టారంటూ పట్టాభి షో.. జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ రిప్ల‌య్‌

పట్టాభి సవాళ్లు విసురుతూ రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగిందన్నారు. డ్యూటీలో ఉన్న సీఐ కనకారావుపై టీడీపీ నేత పట్టాభి దగ్గరుండి మరి దాడి చేయించారని దాడిలో సీఐ తలను తీవ్ర గాయం అయిందన్నారు.

కొట్టారంటూ పట్టాభి షో.. జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ రిప్ల‌య్‌
X

గన్నవరంలో ఉద్రిక్తతకు కారణమయ్యారంటూ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు గన్నవరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పట్టాభి మీడియా కెమెరాలకు తన చేతుల్ని చూపిస్తూ వెళ్లారు. పోలీసులు తనను కొట్టారని, తన చేతులు వాపు వచ్చాయంటూ చూపించారు. టీడీపీ చలో గన్నవరం కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు హద్దులు దాటితే నియంత్రించేందుకు వజ్రా వాహనాన్ని పోలీసులు తీసుకొచ్చారు. గన్నవరంలో 300 మంది పోలీసులు మోహరించారు. పలువురు టీడీపీ నాయకుల్ని కృష్ణా జిల్లాలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

జిల్లా ఎస్పీ జాషువా మాత్రం నిన్న జరిగిన ఘటనలకు పూర్తిగా పట్టాభి కారణమని చెప్పారు. రెండు మూడు రోజులుగా ఇరుపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తూ ఉన్నాయని, అంతవరకు తాము నిశితంగా పరిశీలిస్తూ వచ్చామని, కానీ నిన్న పట్టాభి నేరుగా గన్నవరం వచ్చి వైసీపీ కార్యాలయంపైకి దాడి చేసేందుకు కొందరి వెంటేసుకుని వెళ్లారని, ఆ తర్వాతే పరిస్థితి అదుపుతప్పిందని చెప్పారు.

ఆ తర్వాత మరికొందరు టీడీపీ కార్యాలయం వైపు వెళ్లి దాడి చేశారన్నారు. పట్టాభి సవాళ్లు విసురుతూ రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగిందన్నారు. డ్యూటీలో ఉన్న సీఐ కనకారావుపై టీడీపీ నేత పట్టాభి దగ్గరుండి మరి దాడి చేయించారని దాడిలో సీఐ తలను తీవ్ర గాయం అయిందన్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి విషయంలోనూ సుమోటోగా కేసులు నమోదు చేశామని ఎస్పీ వివరించారు.

తన భర్తను ఎవరో తీసుకెళ్లారంటూ పట్టాభి భార్య చేస్తున్న విమర్శలకు ఎస్పీ సమాధానం ఇచ్చారు. పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారని, ఆయన తమ కస్టడీలోనే ఉన్నారని, అతని వ్యక్తిగత వైద్యుడు కూడా వచ్చి పరీక్షలు నిర్వహించాలని, పట్టాభికి కావాల్సిన భోజనం తెచ్చి పెట్టామని ఎస్పీ వివరించారు. పట్టాభి విషయంలో తాము చాలా మర్యాదగా వ్యవహరిస్తుంటే ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

First Published:  21 Feb 2023 6:24 PM IST
Next Story