Telugu Global
Andhra Pradesh

ఏడుగురిపై వేటు.. 11మందికి చోటు

గుంటూరు, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాల కలెక్టర్లను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.

ఏడుగురిపై వేటు.. 11మందికి చోటు
X

ప్రభుత్వం మారిన తర్వాత అస్మదీయుల్ని అందలమెక్కించడం, అదే సమయంలో తస్మదీయులపై కక్షసాధింపు సహజమే. వారు వీరయినా, వీరు వారయినా ఐఏఎస్, ఐపీఎస్ లకు మాత్రం తిప్పలు తప్పవు. తాజాగా ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత బది'లీలలు' ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సీఎస్, డీజీపీ వంటి కీలక పోస్ట్ లతోపాటు ఇతర ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా తనకు నమ్మకస్తుల్నే నియమించుకుంటున్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో తమను ఇబ్బంది పెట్టారనుకుంటున్నవారిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తున్నారు.

26 జిల్లాలకు గాను ఏపీలో ఏకబిగిన 13 జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలగించింది ప్రభుత్వం. వీరిలో ఏడుగురిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. 11 చోట్ల కొత్త కలెక్టర్లను నియమించింది. విశాఖ, బాపట్ల జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికి అక్కడి జాయింట్ కలెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

గుంటూరు, విశాఖ, అల్లూరి జిల్లా, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. వెట్రిసెల్వి, ప్రశాంతి, బీఆర్ అంబేద్కర్, నాగరాణి, తమీమ్ అన్సారియా.. వీరంతా వివిధ శాఖల్లో డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లుగా ఉండగా.. వీరికి నేరుగా కలెక్టర్ పోస్టింగ్ లు లభించాయి.

మొత్తమ్మీద కూటమి మార్కు మార్పులు, చేర్పులు ఇప్పుడు జోరందుకున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా, అధికారులపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసేవారు, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు కూడా. నారా లోకేష్ ఏకంగా రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఆ మార్పులు ఒక్కొక్కటే మొదలవుతున్నాయి.

First Published:  23 Jun 2024 12:59 AM GMT
Next Story