Telugu Global
Andhra Pradesh

విపక్షాలకు కొరుకుడుపడట్లేదు..! - మార్పులు, చేర్పులు 50కి చేరుతున్నా.. వైసీపీలో అలజడి లేదు

అభ్యర్థుల మార్పులు, చేర్పులతో సీటు దక్కని అసంతృప్త నేతలంతా తమ వైపు క్యూ కడతారని టీడీపీ, జనసేన ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా.. ఎవ్వరూ అటువైపు అడుగులు వేయకపోవడమే వారికి మింగుడుపడటం లేదు.

విపక్షాలకు కొరుకుడుపడట్లేదు..! - మార్పులు, చేర్పులు 50కి చేరుతున్నా.. వైసీపీలో అలజడి లేదు
X

అవును.. ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు వైసీపీలో పరిణామాలు కొరుకుడుపడట్లేదు. వైసీపీలో భారీగా అభ్యర్థుల మార్పులు, చేర్పులు జరుగుతున్నా.. ఆ పార్టీలో పెద్దగా అలజడి లేకపోవడం వాటిని అయోమయంలో పడేస్తోంది. ఇప్పటికే మొదటి రెండు జాబితాల్లో 38 మంది ఇన్‌చార్జిలను మార్చగా, మూడో జాబితా కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా మార్పులు, చేర్పులు 50కి చేరుతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ పెద్ద ఎత్తున చేపట్టిన అభ్యర్థుల మార్పులు, చేర్పులతో సీటు దక్కని అసంతృప్త నేతలంతా తమ వైపు క్యూ కడతారని టీడీపీ, జనసేన ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా.. ఎవ్వరూ అటువైపు అడుగులు వేయకపోవడమే వారికి మింగుడుపడటం లేదు.

టీడీపీ, జనసేన వైపు కన్నెత్తి చూడని నేతలు..

ఒకరిద్దరు నేతలు సీటు దక్కలేదని అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసినప్పటికీ వారు టీడీపీ, జనసేనల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసినా.. ఆయన టీడీపీ, జనసేనల వైపు చూడలేదు. తాను షర్మిల వైపే అని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానంటున్నారు తప్ప ప్రతిపక్ష శిబిరం వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో తాము ఏదో అనుకుంటే ఏదో అవుతోందే అని విపక్ష శిబిరంలో తలలు పట్టుకుంటున్నారు.

జనం నాడికి అనుగుణంగానే.. జగన్‌ అడుగులు

జగన్‌ దుస్సాహసం చేస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నా.. జగన్‌ మాత్రం ప్రజల నాడికి అనుగుణంగానే ముందుకెళుతున్నారు. ప్రజలతో మమేకం కావాలని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారికి సీటు ఉండదని ముందే కచ్చితంగా చెప్పేసిన జగన్‌.. అదే బాటలో ముందుకెళుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఏమాత్రం రిస్క్‌ చేసేందుకు ఆయన ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే వ్యతిరేకత ఉన్న కొన్ని సీట్లు అడ్జస్ట్‌ చేస్తుండగా, మరికొందరికి సీటు లేదని తేల్చి చెప్పేస్తున్నారు. అదే క్రమంలో ఆయా నేతలకు నచ్చచెబుతున్నారు. పార్టీ భవిష్యత్తే ముఖ్యమని, పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఏదోక రూపంలో అందరికీ న్యాయం చేస్తానని స్పష్టం చేస్తూ వారిని బుజ్జగిస్తున్నారు. దీంతో ఆయా నేతలంతా దారిలోనే ఉన్నారు.

మరో కారణం కూడా...

ఇదే క్రమంలో రాజకీయ పరిశీలకులు చెబుతున్న మరో కారణమేమంటే.. టీడీపీ, జనసేనలోకి వెళ్లినా టికెట్‌ గ్యారంటీ లేదని. అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీ కండువా కప్పుకున్నప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ గెలుపు కోసమే ఆయన వచ్చే ఎన్నికల్లో ప‌నిచేయాల్సిన పరిస్థితి. వైసీపీ నుంచి జనసేనలోకి చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌కి కూడా టికెట్‌ హామీ లేదని అంటున్నారు. ఈ పరిణామాలు చూసిన వారంతా వైసీపీలోనే ఉండిపోతున్నారు. జగన్‌ని నమ్ముకుంటేనే ఏదోక రూపంలో ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం షర్మిల కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ, జనసేన వైపు మాత్రం ఎవరూ చూడటం లేదు. ఈ పరిణామాలే ఇప్పుడు ఆ పార్టీలకు కొరుకుడుపడని పరిస్థితి నెలకొంది.

First Published:  6 Jan 2024 10:30 AM IST
Next Story