ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. చంద్రబాబు బాటలోనే జగన్ ప్రయాణిస్తున్నారా..?
అధికారపార్టీ ఎమ్మెల్యేగా తన పరిస్థితే ఇలాగుంటే ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితులు చెప్పనే అవసరంలేదన్నారు. ఎమ్మెల్యేలతో ఉన్నతాధికారులు ఇలా వ్యవహరిస్తున్నారంటే అందుకు జగనే కారణమని మండిపోయారు.
అధికారపార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరోవైపు ఆశించిన స్ధాయిలో అభివృద్ధి పనులు జరగటంలేదు. నిధులకోసం అధికారుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళేమో ఎమ్మెల్యేలను లెక్క కూడా చేయటంలేదు. దాంతో జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఉన్నతాధికారులకు జగన్ ఇస్తున్న చనువు వల్లే అధికారపార్టీ ఎమ్మెల్యేలకు అవమానాలు ఎదురవుతున్నాయంటూ మండిపోతున్నారు. చూస్తుంటే చంద్రబాబు నాయుడు బాటలోనే జగన్ కూడా వెళ్తున్నట్లుందని ఎద్దేవా చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఆవేదన విన్నతర్వాత ఇలాంటి ఆవేదనే చాలామంది ఎమ్మెల్యేల్లో ఉందని అర్థమవుతోంది. మొన్నటివరకు ఇలాంటి ఆవేదనే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంతకీ విషయం ఏమిటంటే.. తన నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ మంత్రి హోదాలో మంత్రి బొత్స సత్యానారాయణ హామీ ఇచ్చి ఏడాదైందన్నారు. దానికి ఇంతవరకు అతీగతీలేదట.
ఇదే విషయాన్ని జగన్ కు చెబితే వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశాలిచ్చారట. నిధుల విషయమై ఆరా తీయటానికి కోటంరెడ్డి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ దగ్గరకు వెళితే తనను అసలు లెక్కే చేయలేదని తెగ ఫీలైపోయారు. జగన్ సంతకం చేసిన ఫైల్‌కు కూడా నిధుల కేటాయింపు జరగలేదన్నారు. అంతేకాకుండా తనను రావత్ నిలబెట్టే మాట్లాడి పంపేసినట్లు చెప్పి బాధపడిపోయారు. తనకు ఎమ్మెల్యే అన్న కనీస మర్యాద కూడా రావత్ ఇవ్వలేదన్నారు.
అధికారపార్టీ ఎమ్మెల్యేగా తన పరిస్థితే ఇలాగుంటే ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేల పరిస్థితులు చెప్పనే అవసరంలేదన్నారు. ఎమ్మెల్యేలతో ఉన్నతాధికారులు ఇలా వ్యవహరిస్తున్నారంటే అందుకు జగనే కారణమని మండిపోయారు. జగన్ ఇస్తున్న అతిచనువు వల్లే ఉన్నతాధికారులు తమను లెక్కచేయటంలేదన్నారు. గతంలో ఇలాంటి ఆరోపణలే చంద్రబాబు హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేల నుండి వినబడేవి. అప్పట్లో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను ఉన్నతాధికారులు లెక్కేచేసేవారు కాదని అప్పట్లో బాధపడేవారు. ఇప్పుడు అదే అనుభవం వైసీపీ వాళ్ళకు ఎదురవుతోంది. ఇందుకనే జగన్ కూడా చంద్రబాబు దారిలోనే నడుస్తున్నారంటూ అధికారపార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.