టీడీపీ - జనసేన మధ్య అప్పుడే వివాదాలా?
ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారని టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమని మంత్రులు పదే పదే చెబుతున్నారు. ఇద్దరు కలిసి అధికారికంగా ప్రకటించేంత వరకు పొత్తు ఖాయమనేందుకు లేదు. అయితే కొన్నిసీట్లపై ఇప్పుడే పంచాయితీలు మొదలైపోయాయి.
ఆలూలేదు చూలూలేదు అన్న సామెతలాగ తయారవుతోంది రెండు పార్టీల మధ్య వ్యవహారం. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయమనే అనుకోవాలి. ఒకప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబునాయుడు బాగా ప్రయత్నించారు. అయితే తర్వాత ఎందుకనో పెద్దగా మాట్లాడలేదు. ఇదే సమయంలో అప్పట్లో స్పందించని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈమధ్యనే పొత్తుకు రెడీ అని బహిరంగంగానే ప్రకటించారు. అయితే చంద్రబాబు నుంచి రెస్పాన్స్ లేదు.
ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారని టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమని మంత్రులు పదే పదే చెబుతున్నారు. ఇద్దరు కలిసి అధికారికంగా ప్రకటించేంత వరకు పొత్తు ఖాయమనేందుకు లేదు. అయితే కొన్నిసీట్లపై ఇప్పుడే పంచాయితీలు మొదలైపోయాయి. తిరుపతి, పిఠాపురం, రాజంపేట, ప్రొద్దుటూరు, జగ్గంపేట, ఏలూరు, అనంతపురం సిటి లాంటి అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోయేది నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. తిరుపతి నియోజకవర్గం సమన్వయకర్త బీద రవిచంద్రయాదవ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తిరుపతి సీటును గెలుచుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నట్లు చెప్పారు.
నేతల మధ్య జరుగుతున్న గొడవలతో అధినేత విసిగిపోయారని కాబట్టి అందరు ఏకతాటిపైన నిలిచి తిరుపతి విజయాన్ని చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని చెప్పారు. బీద అలా చెప్పారో లేదో వెంటనే జనసేన నేతలు అభ్యంతరాలు మొదలుపెట్టారు. తిరుపతిలో పోటీ చేసేది జనసేన మాత్రమే అని స్పష్టం చేశారు. ఇక్కడ నుండి పోటీ చేసేందుకు జనసేన రెడీగా ఉందని తెలిసి టీడీపీ నేతల డ్రామాలేంటని జనసేన నేతలు మండిపోతున్నారు.
అలాగే పైన మిగిలిన చెప్పిన నియోజకవర్గాల్లో కూడా రెండు పార్టీల నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. తమ రెండు పార్టీల మధ్య పొత్తుంటుందని, పోటీ చేయబోయేది తామే అని రెండు పార్టీల నేతలు జనాలతో చెప్పుకుంటున్నారు. దాంతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. రెండు పార్టీల నేతలు పార్టీల సమావేశాలు పెట్టుకుని పోటీకి రెడీగా ఉండాలని ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్‌కు చెప్పేసుకుంటున్నారు. జరుగుతున్నది చూస్తుంటే పోటీ చేసే విషయంలో రెండు పార్టీల మధ్య పెద్ద గొడవలు తప్పవనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.