రూ.20 కోసం వివాదం.. ప్లాన్ చేసి చంపేసిన వైనం - అందరూ స్నేహితులే
విజయవాడ జక్కంపూడి ప్లాట్ల వద్ద ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
వారంతా స్నేహితులు.. కలిసి మద్యం తాగుతారు.. కాలక్షేపం చేస్తారు.. ఒకరి వద్ద డబ్బు ఉన్నప్పుడు మిగిలిన స్నేహితులకూ మందు కొని కలిసి తాగుతారు. అయితే వారి మధ్య రూ.20 వివాదం తెచ్చింది. అది ముదిరి స్నేహితుడిని చంపేవరకూ దారితీసింది. అదీ తాత్కాలిక ఆవేశంలో కాదు.. ప్లాన్ చేసి మరీ..! విజయవాడ జక్కంపూడి ప్లాట్ల వద్ద ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విజయవాడలోని చిట్టినగర్ సాధుజాన్ వీధికి చెందిన మొండి శివ(33) చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సుందరయ్య నగర్‌కు చెందిన ముగడ దుర్గాప్రసాద్, కటికల మస్తాన్ వీధికి చెందిన సమ్మిటి దుర్గారావు అతని స్నేహితులు. తరచూ వీరంతా కలిసి మద్యం తాగుతుంటారు. ఒకరి వద్ద డబ్బు ఉన్నప్పుడు మిగిలినవారికీ మద్యం కొని అందరూ కలిసి తాగుతారు.
చిన్న వివాదంపై కక్ష పెంచుకొని...
డిసెంబర్ 15వ తేదీన వీరంతా కలిసి ఇదే విధంగా మద్యం తాగేందుకు బార్‌కు వెళ్లారు. తనకు రూ.20 కావాలని స్నేహితులిద్దరినీ శివ అడిగాడు. వారు ఇవ్వకపోవడంతో శివ వారిని దూషించాడు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వివాదం ముదిరి గొడవకు దారితీసింది. ఈ నేపథ్యంలో శివపై కక్షపెట్టుకున్న దుర్గాప్రసాద్, దుర్గారావు అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి శివను డిసెంబర్ 18న తమ బైక్‌పై ఎక్కించుకొని జక్కంపూడి 60 : 40 ప్లాట్ల వద్దకు వెళ్లారు అంబాపురానికి చెందిన కొండా మహేష్‌కుమార్‌ను కూడా అక్కడికి పిలిపించారు. నిర్మానుష్యంగా ప్రాంతంలో శివపై బండరాయితో దాడి చేశారు. అతన్ని తలపై మోది హతమార్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.
రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో శివ కోసం అతని కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే గుర్తుతెలియని శవం తమవద్ద ఉండటంతో వారికి చూపించగా, అది శివదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని ఆరా తీయగా, బార్ వద్ద జరిగిన వివాదం గురించి తెలియజేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టగా, బుధవారం పట్టుబడ్డారు. తమదైన శైలిలో విచారణ చేయగా, నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు.