పాడేరు టీడీపీలో చిచ్చు.. రెబల్‌గా గిడ్డి ఈశ్వరి..!
కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల కార్యకర్తలతో గిడ్డి ఈశ్వరి సమావేశం నిర్వహించారు. రెబల్‌గా బరిలో ఉండాలని కార్యకర్తలు కోరడంతో ఆమె అందుకు సుముఖత వ్యక్తం చేశారు.
ఎన్నికల టైమ్ సమీపిస్తున్నప్పటికీ.. కూటమి పార్టీల్లో అసమ్మతి చల్లారడం లేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. తాజాగా అల్లూరి సీతరామరాజు జిల్లా పాడేరు టీడీపీలో అగ్గి రాజుకుంది. తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రకటించారు. ఐదేళ్లు ఖర్చు పెట్టుకుని, పార్టీ కోసం కష్టపడితే.. చివరకు టికెట్ వేరే వాళ్లకు ఇచ్చి తనను మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల కార్యకర్తలతో గిడ్డి ఈశ్వరి సమావేశం నిర్వహించారు. రెబల్‌గా బరిలో ఉండాలని కార్యకర్తలు కోరడంతో ఆమె అందుకు సుముఖత వ్యక్తం చేశారు. గిడ్డి ఈశ్వరిని గెలిపించుకుంటామని కార్యకర్తలు తీర్మానం చేశారు.
2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి 2019 ఎన్నికల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం కోసం కష్టపడుతూ వస్తున్నారు. ఈ ఐదేళ్లు పార్టీ నిర్వహణ ఖర్చంతా తానే భరించారు. అయితే చివరకు గిడ్డి ఈశ్వరికి హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు.. ఇటీవల పార్టీలో చేరిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిళ్లు వెంకట రమేష్‌కు టికెట్ ఇచ్చారు.