Telugu Global
Andhra Pradesh

చర్చలు విఫలం.. రోడ్డెక్కేందుకు ఉద్యోగులు సిద్ధం..

మధ్యేమార్గంగా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్)ని తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. కానీ ఉద్యోగులు ససేమిరా అన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచింది, చివరకు అవి పూర్తిగా విఫలమయ్యాయి.

చర్చలు విఫలం.. రోడ్డెక్కేందుకు ఉద్యోగులు సిద్ధం..
X

అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మేనిఫెస్టోలో పొందుపరిచిన 95 శాతం హామీలు అమలు చేశామని చెబుతుంటారు వైసీపీ నేతలు. మిగిలిన ఆ 5 శాతం హామీల్లో సీపీఎస్ ఒకటి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే తీసుకొస్తామంటూ, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ పై నిర్ణయం తీసుకుంటామని ఆనాడు పాదయాత్రలో హామీ ఇచ్చారు జగన్. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా సీపీఎస్ రద్దు కాలేదు. కారణం ఖజానాపై భారీగా భారం పడుతుందనే భయమే. సంక్షేమ పథకాలతో ఇప్పటికే ఏపీ ఖజానాపై భారం ఉంది, సీపీఎస్ రద్దు చేస్తే కోలుకునే అవకాశం లేదు. అందుకే మధ్యేమార్గంగా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్)ని తెరపైకి తెచ్చింది ప్రభుత్వం. కానీ ఉద్యోగులు ససేమిరా అన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచింది, చివరకు అవి పూర్తిగా విఫలమయ్యాయి.

జీపీఎస్ ని ఒప్పుకోం..

జీపీఎస్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు ఉద్యోగ సంఘాల నాయకులు. తాజాగా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణతో జరిగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రులు కుదరదని చెప్పడంతో ఇక ఉద్యమకార్యాచరణకు సిద్ధమవుతున్నామని తేల్చి చెప్పారు ఉద్యోగులు. సెప్టెంబర్ 1నుంచి ఆందోళనలకు దిగుతామని తేల్చి చెప్పారు.

మునిగిపోతాం.. వినండి..

పాత పెన్షన్ విధానం(ఓపీఎ) అమలు చేస్తే ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పారు మంత్రులు. పైగా దాన్ని తిరిగి తీసుకొస్తే కేంద్రం కూడా నట్లు, బోల్ట్ లు బిగిస్తుందని చర్చల్లో మంత్రి బుగ్గన చెప్పినట్టు ఉద్యోగ సంఘాల నాయకులంటున్నారు. మంత్రి బొత్స కూడా ఈ విషయంలో ఉద్యోగులు ఒప్పుకుంటే వైసీపీ మేనిఫెస్టోలోని హామీలు 100 శాతం అమలైనట్టవుతుందని అన్నారు. కానీ ఎక్కడా మధ్యేమార్గం కనిపించలేదు. జీపీఎస్ లో సవరణలు చేస్తామన్నా ఉద్యోగులు అంగీకరించలేదు. దీంతో సెప్టెంబర్ 1న సీఎం ఇంటి ముట్టడి, విజయవాడలో బహిరంగ సభకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతుండటం ప్రభుత్వ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. పోలీసులతో కట్టడి చేయాలని చూస్తే అది మరింత ఇబ్బందిగా మారుతుందేమనని ఆలోచిస్తున్నారు నేతలు.

First Published:  27 Aug 2022 8:32 AM IST
Next Story