పార్టీ వదిలేసినా పార్లమెంట్ వదిలేలా లేదు.. ఢిల్లీకి చేరిన మాధవ్ వ్యవహారం
ఆ వీడియోపై దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని సహా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు, జాతీయ మహిళా కమిషన్ కు లేఖలు రాశారు జస్బీర్ సింగ్. దీంతో జాతీయ స్థాయిలో ఈ వీడియోపై మరోసారి చర్చ మొదలైంది.
గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం తేల్చేసినా, అది ఢిల్లీ వరకు చేరిపోయింది. అనంతపురం ఎస్పీ ప్రెస్ మీట్ తర్వాత ఈ వీడియో ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పడిందని అనుకున్నా.. ఆ తర్వాతే మరిన్ని ట్విస్ట్ లు మొదలయ్యాయి. జాతీయ మహిళా కమిషన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కీలక పరిణామం. మాధవ్ వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు. వీడియో కాల్ ఆరోపణలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. మరోవైపు ఏకంగా ప్రధాని మోదీకి ఈ వీడియోపై ఫిర్యాదు అందింది. పంజాబ్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ ఈ వీడియోపై ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఇది పార్లమెంట్ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీలకు మాయని మచ్చలా ఉందని, ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారంటూ కొన్ని ఘాటు పదాలు కూడా వాడారు. ఆ వీడియోపై దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని సహా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు, జాతీయ మహిళా కమిషన్ కు లేఖలు రాశారు జస్బీర్ సింగ్. దీంతో జాతీయ స్థాయిలో ఈ వీడియోపై మరోసారి చర్చ మొదలైంది.
వామపక్షాలు కూడా..
ఇప్పటి వరకూ ఇదీ వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉంది. దీనిపై జనసేన, బీజేపీ కూడా పెద్దగా స్పందించలేదు. రాజకీయ కక్షతోనే ఈ వీడియోలు సృష్టించారంటూ పదే పదే టీడీపీని టార్గెట్ చేసింది వైసీపీ. కానీ ఇప్పుడు వామపక్షాలు కూడా ఇందులో ఎంటరయ్యాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లేకుండానే దాన్ని ఫేక్ వీడియో అని ఎలా చెబుతారని ప్రశ్నించారు సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. ఆ వీడియో వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని విమర్శించారు. పార్టీనుంచి వచ్చిన మద్దతు చూస్తే.. మహిళలను అవమాన పరిచేలా ఉందని చెప్పారు.
సిట్ కు డిమాండ్..
అనంతపురం ఎస్పీ ప్రెస్ మీట్ వ్యవహారం కూడా ఆ కేసుని నీరుగార్చడానికే అని మండిపడ్డారు రాఘవులు. ఈ వ్యవహారంలో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేపట్టాలన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లేకుండా ఫేక్ వీడియో అని చెప్పడంపై రాఘవులు మండిపడ్డారు. ఈ ఎపిసోడ్ ని వ్యక్తులు మధ్య వ్యవహారంగా మారుస్తున్నారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ చేసిన వికృత చేష్టల్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో సీపీఎం కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తుందని అన్నారు రాఘవులు.
గవర్నర్ వద్దకు..
మరోవైపు ఏపీ మహిళా జేఏసీ నేతలు గవర్నర్ ని కలసి మాధవ్ వీడియోపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మహిళల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. గవర్నర్ ని కలసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.