బాబును ప్రశ్నలతో ఉతికేసిన వర్మ.. - హిట్లర్, ముస్సోలినీలను బాబు గుర్తుచేశాడని కామెంట్స్
ఒక్క మాటలో చెప్పాలంటే హిట్లర్, ముస్సోలినీ తర్వాత చంద్రబాబే అంటూ విమర్శించారు. పర్సనల్ ఈగో తప్ప ప్రజలంటే పట్టదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
తన వ్యాఖ్యలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. సినీ రంగంతో పాటు అనేక రంగాలపై రెగ్యులర్‌గా స్పందిస్తూ.. కామెంట్లు చేస్తూనే ఉంటారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబును ప్రశ్నలతో ఉతికారేశారనే చెప్పాలి. ఇటీవల జరిగిన కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో ఆర్జీవీ ఒక వీడియో విడుదల చేశారు.
కందుకూరులో ఇరుకు సందుల్లో ఏర్పాటు చేసిన చంద్రబాబు సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే వెను వెంటనే గుంటూరులో చంద్రన్న కానుక పేరుతో జరిగిన మరో కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తన ప్రచార యావతో ఇలా జనం ప్రాణాలు బలిగొన్నారని అధికార పక్షం నేతలైతే విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల సందర్భంగా 29 మందిని బలిగొన్న ఘటనను కూడా గుర్తు చేశారు.
తాజాగా కందుకూరు, గుంటూరు ఘటనలపై రామ్‌గోపాల్‌వర్మ కూడా స్పందించారు. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు బలిగొంటావా అంటూ విరుచుకుపడ్డారు. ఇదేనా నీ సుదీర్ఘ అనుభవం అంటూ నిలదీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే హిట్లర్, ముస్సోలినీ తర్వాత చంద్రబాబే అంటూ విమర్శించారు. పర్సనల్ ఈగో తప్ప ప్రజలంటే పట్టదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంతమంది చనిపోతే అంత పాపులారిటీ వస్తుందని చంద్రబాబు ఫీలవుతారని మండిపడ్డారు. రాజకీయ నాయకుడికి ప్రజల సంక్షేమమే ముఖ్యం కావాలని, వారిని చంపి పాపులారిటీని పెంచుకోవాలనుకోవడం కంటే మరో దారుణం లేదని ఆయన విమర్శించారు.